
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర మంత్రులు అప్రమత్తమయ్యారు. ఘటన తీవ్రత ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అధికారులతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు
రాజోలు సమీపంలోని గెద్దాడవారి కుంత వద్ద గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. గ్యాస్ లీకేజీ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసర గ్రామాల ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
హోంమంత్రి అనిత ఆరా
మరోవైపు కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు.
గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి వాసంశెట్టి సుభాష్
ఇదిలా ఉండగా గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులకు స్పష్టం చేశారు.
మొత్తంగా కోనసీమ గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో మంత్రులు వరుసగా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.
