
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఏపీ తీరంవైపు పయనిస్తుండగా, మంగళవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 620 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 16 సాయంత్రానికి తుపానుగా, నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో నవంబర్ 18 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
రాయలసీమలో నవంబర్ 19, 20 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో నవంబర్ 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు, నవంబర్ 21న పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
