హరిహర మానసపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువైన కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం మండల-మకరవిళక్కు పూజల కోసం సోమవారం తెరుచుకుంది. రెండు నెలలకు పైగా కొనసాగనున్న ఈ పవిత్ర యాత్రా సీజన్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు.

నవంబర్‌ 17వ తేదీ ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

అయితే ఆలయం తెరుచుకున్న తొలిరోజే అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోగా, రద్దీ పంబ ప్రాంతం వరకు విస్తరించింది. అయ్యప్ప నామస్మరణతో శబరిమల పరిసరాలు మార్మోగుతున్నాయి.

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు నవంబర్‌ 16వ తేదీ సోమవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీధర్మశాస్తా సన్నిధానంలోని గర్భగుడి తలుపులను తెరిచారు. తంత్రి కందరారు బ్రహ్మదత్తన్‌ మార్గదర్శకత్వంలో కొత్త మేల్‌సంతిలు బాధ్యతలు స్వీకరించారు. శబరిమల ప్రధాన అర్చకుడిగా సుబ్రహ్మణ్య శంకరన్‌ నంబూద్రి, మాళికాప్పురం ఆలయ ప్రధాన అర్చకుడిగా దామోదరన్‌ నంబూద్రి బాధ్యతలు చేపట్టారు.

అనంతరం వీరిద్దరూ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను అధిరోహించి సన్నిధానానికి చేరుకున్నారు. అయ్యప్ప నామస్మరణల మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ ఏడాది మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌ అధికారికంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున నెయ్యాభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.

పంబ వరకు కొనసాగుతున్న భక్తుల క్యూలైన్లు

మరోవైపు, అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు తరలివస్తున్నారు. భక్తుల రాకతో క్యూలైన్లు పంబ వరకు విస్తరించాయి. తొలి రోజే సుమారు 30 వేల మంది భక్తులు దర్శనం కోసం వర్చువల్ క్యూ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మంగళవారం నుంచి రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. ఇందులో 60 వేల మందికి వర్చువల్ క్యూ ద్వారా, మరో 10 వేల మందికి నీలక్కల్‌ వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా అవకాశం కల్పిస్తారు.

అలాగే సంప్రదాయ అటవీ మార్గాలైన ఎరుమేలి, పులుమేడు నుంచి ఒక్కో మార్గంలో 3 వేల మందికి చొప్పున, వండిపెరియార్‌ సత్రం మార్గంలో మరో 2 వేల మందికి టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ మార్గాల్లో దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. పంబ వద్ద మాత్రం స్పాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ యాత్రా సీజన్‌లో ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పిస్తారు. ఉదయం నుంచి 11 గంటల వరకు నెయ్యాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్న పూజలు పూర్తయిన తర్వాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. అనంతరం హరివరాసనం పాటించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు.

డిసెంబర్‌ 27వ తేదీతో మండల పూజలు ముగియనున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి, మకరవిళక్కు ఉత్సవాల కోసం డిసెంబర్‌ 30న తిరిగి తెరుస్తారు. జనవరి 14న పవిత్రమైన మకరవిళక్కు వేడుక నిర్వహించనున్నారు. జనవరి 20న పద్దెనిమిది మెట్ల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేయడంతో ఈ ఏడాది యాత్రా సీజన్‌ ముగియనుంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు

ఈసారి శబరిమలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. భక్తుల కోసం తాత్కాలిక వసతులు, వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు.

సంప్రదాయం ప్రకారం 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టి, ఇరుముడి ధరించిన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శన ఏర్పాట్లు, భద్రత, రవాణా సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *