
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి పరిశీలించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాలతో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాలపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు కల్పించింది.
ఉద్యోగుల వేతనాలు, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పీఆర్సీ తన సిఫారసులను రూపొందించనుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించి తుది సిఫారసులు చేయనుంది. ఈ ప్రక్రియ ముందుకు సాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 12వ పీఆర్సీపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, సంబంధిత వర్గాలు తమ సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను డిసెంబర్ 31వ తేదీలోగా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
అయితే కొన్ని వర్గాలను ఈ పీఆర్సీ పరిధి నుంచి మినహాయించారు. ఎయిడెడ్ కళాశాలల బోధనా సిబ్బంది, యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్ పే స్కేళ్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, రెండో జాతీయ న్యాయ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు పొందుతున్న న్యాయాధికారులకు ఈ వేతన సవరణ వర్తించదు.
ఎవరెవరికి పీఆర్సీ సిఫారసులు వర్తిస్తాయి?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే వర్క్చార్జ్డ్ ఉద్యోగులు, పూర్తికాలపు కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, సర్వీస్ నిబంధనలపై కూడా కమిషన్ సిఫారసులు చేయనుంది.
ఈ వర్గాల ఉద్యోగుల వేతన సవరణతో పాటు ఇతర సేవా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పీఆర్సీ పరిశీలించనుంది. సంబంధిత వర్గాల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ తన సిఫారసులను రూపొందించనుంది.
12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్లకు సంబంధించి పలు కీలక అంశాలను పరిశీలించనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న కరువు భత్యం (డీఏ)లో ఎంత మొత్తాన్ని మూలవేతనంలో విలీనం చేయాలనే అంశంపై అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా కొత్త పే స్కేళ్లను ఖరారు చేయనుంది.
అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించి, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అనే అంశంపై సిఫారసులు చేయనుంది. ఉద్యోగులకు అందుతున్న స్పెషల్ పే, కాంపెన్సేటరీ అలవెన్సులు, ఇతర భత్యాల రేట్లు, నిబంధనలను కూడా సమీక్షించనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ విధానాన్ని పరిశీలించి, పెన్షనర్లకు అవసరమైన మార్పులను సూచించనుంది. కొన్ని కేటగిరీల పోస్టులను గెజిటెడ్ హోదాలోకి మార్చేందుకు అవసరమైన నిబంధనలపైనా సిఫారసులు చేయనుంది.
రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల అవసరాలను కూడా కమిషన్ సమీక్షించనుంది. ఈ పరిశీలనలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అంశాలనూ పరిగణనలోకి తీసుకోనుంది. వీటన్నింటిపై సిఫారసులు రూపొందించే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనుంది.
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు అవకాశం కల్పించింది.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలై ఉండి, ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు ఈ అవకాశానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులతో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసినవారు, ఫ్యామిలీ పెన్షనర్లు కూడా ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అర్హులైన వారంతా 2026 డిసెంబర్ 31వ తేదీలోగా తమ ఆప్షన్లను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
ఈ నిర్ణయంతో అర్హత కలిగిన సీపీఎస్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ పెన్షనర్లకు పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం కలగనుంది.
