అమరావతి: బంగాళాఖాతంలో అక్వాన్‌ తుపాను బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్‌ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హైఅలర్ట్‌గా ఉండి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అక్వాన్‌ తుపాను మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు హోంమంత్రికి వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

గతంలో సమష్టి కృషితో రెండు తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్న హోంమంత్రి.. అదే స్ఫూర్తితో ప్రస్తుత తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

రానున్న నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకునేలా అవసరమైన సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *