
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా కీలక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న చారిత్రక ఖల్సా దివాన్ గురుద్వారా పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఫిలిప్పీన్స్‌లోనే అత్యంత పురాతనమైన ఈ గురుద్వారా శతాబ్దానికి పైగా సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
మూడు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ఖల్సా దివాన్ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా పునరాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో మనీలా నగర మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో పాల్గొన్నారు.
అనంతరం గురుద్వారాలో ప్రధాని మోదీ ‘కార్ సేవ’ (స్వచ్ఛంద సేవ) నిర్వహించారు. చారిత్రక గురుద్వారాను సందర్శించడం ఇక్కడ కొంత సమయం గడపడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు.
1901లో స్థాపించిన చారిత్రక గురుద్వారా
ఖల్సా దివాన్ గురుద్వారాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1901లో తొలిసారిగా దీనిని స్థాపించారు. 1903లో వ్యవస్థీకృత సంస్థగా రూపుదిద్దుకోగా 1924లో ఖల్సా దివాన్ పేరుతో అధికారికంగా నమోదు చేశారు. ఫిలిప్పీన్స్‌లో ఏర్పాటైన తొలి గురుద్వారాగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
మనీలాలో నివసిస్తున్న సిక్కులు, పంజాబీ కుటుంబాలకు తరతరాలుగా ఈ గురుద్వారా ఆధ్యాత్మిక కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రార్థనలు మతపరమైన కార్యక్రమాలతో పాటు సిక్కు సంప్రదాయాలు, గురువుల బోధనలు, సేవాభావాన్ని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం
ఖల్సా దివాన్ కేవలం ప్రార్థనా మందిరానికే పరిమితం కాకుండా పలు సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. సిక్కు సమాజంతో పాటు ఇతర వర్గాల ప్రజలకు కూడా వివిధ సేవలు అందిస్తోంది.
ముఖ్యంగా మనీలాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు వారి మతపరమైన సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలో ఈ గురుద్వారా విశేష పాత్ర పోషిస్తోంది. తాజాగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన పునరాభివృద్ధి కార్యక్రమంతో ఈ చారిత్రక ప్రార్థనా మందిరానికి మరింత ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
