
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి ఒకరోజు ముందే మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని అనుచరుడు ఉమర్ నిసార్ దార్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను తాజాగా విడుదల చేశారు.
నవంబర్ 10న మీర్ బజార్, అఖ్రాన్ సహా కుల్గామ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీరిద్దరూ సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది. ఆయా ప్రాంతాల్లో లక్ష్యాలను పరిశీలించిన అనంతరం మరుసటి రోజు సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, లారూ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. అయితే లతీఫ్ భట్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కుల్గామ్ జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు భద్రతా బలగాలు చేపడుతున్న చర్యల్లో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన కాల్పుల ఘటనకు ముందే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు.
మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని సహచరుడు ఉమర్ నిసార్ దార్ దాడులకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తూ సంచరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో వారు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యారు. తాజాగా భద్రతా బలగాలు ఆ దృశ్యాలను గుర్తించి విడుదల చేశాయి.
ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం
మరోవైపు సోమవారం కుల్గామ్ జిల్లాలోని లారూ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఉమర్ నిసార్ దార్ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే భద్రతా బలగాల చర్యల నుంచి లతీఫ్ భట్ తప్పించుకున్నాడు.
దీంతో పరారీలో ఉన్న లతీఫ్ భట్ ఆచూకీ కోసం భద్రతా బలగాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా కుల్గామ్ జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు తమవైపు వస్తున్నట్లు గుర్తించిన ఉగ్రవాదులు సమీపంలోని యాపిల్ తోట పక్కన ఉన్న రెండు పాఠశాలల వైపు పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పాఠశాల భవనాలు, పరిసర తోటల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి భద్రతను నిర్ధారించిన అనంతరం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఎదురుకాల్పులు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు ఉమర్ నిసార్ దార్ అదృశ్యాన్ని పోలీసులు సాధారణ మిస్సింగ్ కేసుగా పరిగణించారు. నవంబర్ 11న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై కాల్పుల ఘటన జరిగిన రోజే ఉమర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కుల్గామ్ జిల్లాలోని అర్రే గ్రామం నుంచి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టారు. ఈ పరిశీలనలో కీలక విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 10న మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ తదితర ప్రాంతాల్లో లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ కలిసి సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు.
వీరిద్దరూ సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి ముందు ఆయా ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆధారాలతో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు తదుపరి చర్యలు చేపట్టాయి.
మరుసటి రోజు అంటే నవంబర్ 11న లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ తమ ప్రణాళిక ప్రకారం సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. కాల్పుల ఘటన తర్వాత ఉగ్రవాదులు పారిపోతున్న దృశ్యాలు కూడా మార్గమధ్యంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఉమర్ అదృశ్యంపై నమోదైన మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. గతంలో రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్.. ఇటీవలే ఉగ్రవాద కార్యకలాపాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత ఐదారు నెలలుగా లష్కరే కమాండర్ లతీఫ్ భట్‌కు ఆశ్రయం కల్పించడంతో పాటు అతనికి వివిధ రూపాల్లో సహకరిస్తున్నట్లు నిర్ధారించాయి.
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై దాడి అనంతరం ఉమర్ తన గ్రామానికి తిరిగి వెళ్లకుండా టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరోవైపు సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఉమర్ నిసార్ దార్ మృతదేహాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకున్న లతీఫ్ భట్ కోసం భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. పలు గ్రామాలు, యాపిల్ తోటల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి అతడి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి.
