ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడమే కాదు.. శారీరకంగా చురుగ్గా ఉండటం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలా అయితేనే శరీరం ఫిట్‌గా ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడమే కాదు.. శారీరకంగా చురుగ్గా ఉండటం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలా అయితేనే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అనారోగ్యం దరిచేరదు. ఈ బిజీ లైఫ్‌లో కొందరు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తారు. మరికొందరు నడకకు ప్రాధాన్యం ఇస్తారు. తీరిక చేసుకుని ఉదయం లేదా సాయంత్రం వేళలో నడుస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏదీ మంచిది. లేక ఈ రెండూ పూట్ల నడవడం మంచిదేనా?.. ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..

నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడక శరీర బరువును అదుపులో ఉంచుతుంది. కండరాలతో పాటు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే క్రమం తప్పకుండా నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును కాపాడడానికి సహాయపడుతుంది. ఇక రోజుకు 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం దాదాపు 40 నుంచి 50 శాతం తగ్గుతుందని పలు పరిశోధనల్లో ఇప్పటికే స్పష్టమైంది.
ఉదయం నడక వల్ల కలిగే ప్రయోజనాలు..
- ఉదయం వేళ నడవడం వల్ల రోజు చాలా శక్తిమంతమైన, ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని ఇస్తుంది.
- ఉదయం సూర్యరశ్మి శరీరంలో విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- రోజంతా పని చేయడం వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేని వారికి ఈ ఉదయం పూట నడక అత్యుత్తమం.
- ఖాళీ కడుపుతో నడవడం వల్ల శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
సాయంత్రం నడక వల్ల కలిగే ప్రయోజనాలు..
- సాయంత్రం వేళ నడవడం వల్ల.. రోజంతా ఉండే శారీరక మానసిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఈ సమయంలో నడిస్తే.. శరీరంలో ‘ఎండార్ఫిన్లు’ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే..
- రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే.. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
- కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
- 2020లో ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సాయంత్రం పూట నడవడం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
