
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వయసున్న చంద్రబాబుకు పెళ్లి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాలంటూ వ్యాఖ్యలు చేస్తారా? ఆత్మీయ బంధాలకు అడ్డమైన సంబంధాలు అంటగడతారా? అంటూ ప్రశ్నించారు.
సాక్షి దినపత్రికలో తనపై ప్రచురించిన కథనాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి కథనాలు రాయడం వావివరసలు తెలిసినవారు చేసే పనేనా? సమాజం పట్ల విలువలు ఉన్నవారు రాసే రాతలేనా? అంటూ మండిపడ్డారు. ఒక ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పిల్లల వివాహాలకు చంద్రబాబును స్వయంగా ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. మరి అప్పుడు వైఎస్ కూడా చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లేనా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై నిందలు వేయడమే జగన్కు చెందిన పత్రిక విధానమా? అంటూ విమర్శించారు. ఇది వైసీపీ అండ్ కో దిగజారుడు సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
సాక్షి కథనంపై షర్మిల తీవ్ర అభ్యంతరం
తనపై, తన కుటుంబంపై జరిగిన వ్యక్తిత్వ హననానికి బాధ్యత ఎవరు వహిస్తారని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి రాతలకు జగన్ సమాధానం చెబుతారా? లేక సాక్షి పత్రికతో వివరణ ఇప్పిస్తారా? అని నిలదీశారు.
మహిళల పట్ల అమితమైన ప్రేమ ఉందని చెప్పుకునే వారు.. తమ పత్రికలో ప్రచురించిన ఇలాంటి అభ్యంతరకర కథనాలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఆత్మీయ బంధాలకు తప్పుడు అర్థాలు వెతకడం ద్వారా వారి ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో అర్థమవుతోందని షర్మిల ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
