బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా తీరంవైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గత ఆరు గంటలుగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తాజా సమాచారం ప్రకారం.. చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.

అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం

అక్వాన్ తుపాను ఇవాళ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండనుంది. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తుపాను నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *