Apple Services Shutdown: ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ సేవలు ఒక్కసారిగా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. యాప్ స్టోర్ ఓపెన్ కావడం లేదా? ఐక్లౌడ్‌లోకి లాగిన్ కాలేకపోతున్నారా? యాపిల్ మ్యూజిక్ పనిచేయడం లేదా? ఇలాంటి సమస్యలతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అంతరాయాన్ని యాపిల్ సంస్థ కూడా అధికారికంగా ధృవీకరించింది. ఈ పరిణామం యాపిల్ యూజర్లను కలవరపెడుతోంది.

ఈసారి యాపిల్‌కు చెందిన ఒక్క సేవ మాత్రమే కాదు.. అనేక కీలక ప్లాట్‌ఫామ్‌లు సమస్యలను ఎదుర్కొన్నాయి. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్‌కేర్ ఆన్ డివైస్, ఐక్లౌడ్ అకౌంట్ అండ్ సైన్ ఇన్ సేవల్లో అంతరాయం నమోదైంది. దీంతో యూజర్లు కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం, తమ యాపిల్ అకౌంట్లలోకి ప్రవేశించడం వంటి పనులు చేయలేకపోయారు. ఐక్లౌడ్ సేవలపై ఆధారపడే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరోవైపు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11.40 గంటల సమయంలో యాపిల్ పే సేవలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. మధ్యాహ్నానికి ముందు ఐక్లౌడ్ సేవలపై కూడా పెద్ద సంఖ్యలో నివేదికలు నమోదయ్యాయి.

సైబర్ దాడి జరిగిందా? యాపిల్ ఏమందంటే?

యాపిల్ సేవలు ఒకేసారి నిలిచిపోవడంతో సైబర్ దాడి జరిగిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అంతరాయం వెనుక సైబర్ దాడి లేదని సంస్థ స్పష్టం చేసింది. పలు సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు వెల్లడించింది. యాపిల్ ఎకోసిస్టమ్‌లోని అనేక సేవలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ముఖ్యంగా అకౌంట్, సైన్ ఇన్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో సమస్య తలెత్తితే యాప్ స్టోర్ నుంచి ఐక్లౌడ్ వరకు ఇతర సేవలను ఉపయోగించడంపైనా ప్రభావం పడుతుంది. అందుకే ఒకే సమయంలో పలు ప్లాట్‌ఫామ్‌లలో సమస్యలు కనిపించాయి.

యాపిల్ మాత్రమే కాదు.. వరుసగా టెక్ దిగ్గజాలకు షాక్!

గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కీలక డిజిటల్ వ్యవస్థలు వరుసగా సాంకేతిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా యాపిల్ సేవలు కూడా ఈ జాబితాలో చేరాయి. నవంబర్ 16న అమెరికాలో చేజ్ బ్యాంక్‌కు సంబంధించిన సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ఇతర ఆర్థిక సంస్థలపైనా పడింది. వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ జెల్లే వినియోగదారులు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు.

అంతకుముందు నవంబర్ 13న అమెరికా విమానయాన రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానాల కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థల్లో అస్థిరత ఏర్పడటంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. గత 25 ఏళ్లలో తొలిసారిగా ఇలాంటి దేశవ్యాప్త గ్రౌండ్ స్టాప్ విధించింది. రెండు ప్రాంతాల్లో భారీగా డేటా ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు.

ఇక నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ సేవల్లోనూ భారీ అంతరాయం ఏర్పడింది. దీంతో చాలామంది ఔట్‌లుక్ ఈమెయిల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారు. మైక్రోసాఫ్ట్ 365లోని టీమ్స్, వర్డ్ వంటి సేవలను ఉపయోగించడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థగా పేరొందిన మారియట్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లోనూ సమస్యలు నమోదయ్యాయి.

డిజిటల్ ప్రపంచానికి వరుస అంతరాయాలు.. ఏం జరుగుతోంది?

ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు మొబైల్‌లోనే లావాదేవీలు చేస్తున్నారు. విమాన టికెట్ల బుకింగ్ నుంచి హోటల్ రిజర్వేషన్లు, ఆఫీస్ పనుల నుంచి వ్యక్తిగత ఫొటోల భద్రత వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పెద్ద డిజిటల్ వ్యవస్థలో సమస్య తలెత్తినా లక్షలాది మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

బ్యాంకింగ్, విమానయానం, టెక్నాలజీ రంగాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ అంతరాయాలు డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడటంలో ఉన్న సవాళ్లను మరోసారి బయటపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే యాపిల్ వంటి సంస్థ సేవల్లో సమస్యలు తలెత్తడం టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంతరాయాలకు కారణమైన సాంకేతిక సమస్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యాపిల్ సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరిస్తారన్నది వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *