లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 320కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్వాసం ప్రకటించారు. ఈసారి గత ఎన్నికల రికార్డులను సైతం అధిగమిస్తామని పేర్కొన్నారు.

రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. 320 సీట్ల మార్కును దాటుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా తమ పార్టీ పనిచేస్తోందని సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లపై యోగి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల పాలనకు, తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో జంగిల్ రాజ్, గూండారాజ్ కొనసాగాయని, కర్ఫ్యూలు, దోపిడీలు నిత్యకృత్యంగా ఉండేవని ఆరోపించారు.

కుటుంబ, కుల రాజకీయాలతో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *