
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తమిళనాడుకు చెందిన కొందరు అధికారులు పెట్టుబడులకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు లీక్ చేశారనే ప్రచారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో భాగంగానే విజయ్ ప్రభుత్వం 15 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుందని, వారిలో ముగ్గురికి ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లభించాయని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ ప్రచారంపై పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’ స్పందించింది. గత ఐదు నెలలుగా తమ సంస్థలో ఎలాంటి మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపులు జరగలేదని స్పష్టం చేసింది. దీంతో ఏపీకి డేటా లీక్, 15 మంది ఉద్యోగుల తొలగింపు అంటూ జరుగుతున్న ప్రచారంపై కొత్త చర్చ మొదలైంది.
తమిళనాడుకు వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు లీక్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో 15 మంది ఉద్యోగులను విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తొలగించిందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారంపై ‘గైడెన్స్ తమిళనాడు’ సంస్థ తాజాగా స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. 2026 జూలై నుంచి తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.
ఉద్యోగుల నిష్క్రమణ సాధారణ ప్రక్రియే
తమ సంస్థలో మూకుమ్మడి రాజీనామాలు జరగలేదని గైడెన్స్ తమిళనాడు వెల్లడించింది. మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య, బదిలీలు, వ్యక్తిగత లేదా కుటుంబ కారణాలతో ఉద్యోగులు సంస్థను వీడటం సహజమేనని పేర్కొంది. ఇతర సంస్థల్లో అవకాశాలను వెతుక్కోవాలనుకునే ఉద్యోగుల వృత్తిపరమైన ఆకాంక్షలను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపింది.
పెట్టుబడుల్లో ఆరోగ్యకరమైన పోటీ
పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాలతో తమిళనాడు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక పోటీని కొనసాగిస్తోందని సంస్థ స్పష్టం చేసింది. ఈ పోటీ దేశ సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు తమిళనాడు ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతోందని వెల్లడించింది. తాజా ప్రకటనతో ఏపీకి పెట్టుబడుల సమాచారం లీక్, ఉద్యోగుల తొలగింపుల వ్యవహారంపై జరుగుతున్న ప్రచారానికి గైడెన్స్ తమిళనాడు తన వివరణ ఇచ్చినట్లయింది.
తమిళనాడు పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేశారనే ఆరోపణలతో పలువురు ఉద్యోగులపై విజయ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఏకంగా 15 మంది ఉద్యోగులను తొలగించినట్లు కథనాలు వెలువడ్డాయి. వీరిలో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులై, ఆ తర్వాత డీఎంకే పాలనలోనూ కొనసాగిన కొందరు అధికారులు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, ఈ డేటా లీక్ వివాదం నేపథ్యంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఆమె పాత్రపై విచారణ జరిపించాలని కూడా కోరుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు లేదా ఉద్యోగుల తొలగింపులు జరగలేదని గైడెన్స్ తమిళనాడు అధికారికంగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారం, సంస్థ ఇచ్చిన వివరణ మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ‘మసాలా’ వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార పార్టీ టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వచ్చే జనవరిలో దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తేల్చుకుందామని ఏపీ ప్రభుత్వానికి టీవీకే జాతీయ అధికార ప్రతినిధి సవాల్ విసిరారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో రాజకీయ వివాదం కొనసాగుతున్న తరుణంలో.. గైడెన్స్ తమిళనాడుకు చెందిన ఉద్యోగులు కీలక సమాచారాన్ని ఏపీకి లీక్ చేశారనే ఆరోపణలు తెరపైకి రావడం మరింత చర్చకు దారితీసింది. దీంతో ఏపీ, తమిళనాడు మధ్య పారిశ్రామిక పెట్టుబడుల పోటీ కాస్తా రాజకీయ వివాదంగా మారుతోంది.
