న్యూఢిల్లీ: భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరిందని, ఉత్పత్తి రంగం బలహీనపడటంతో పాటు విద్యావ్యవస్థ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక విధానాలనే కొనసాగిస్తే భవిష్యత్తులో దేశం మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత ఆర్థిక నమూనా గత దశాబ్ద కాలంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించలేకపోయాయని అభిప్రాయపడ్డారు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఉద్యోగాల కల్పనతో పాటు వ్యవసాయ రంగానికి కూడా అవి కీలకమని పేర్కొన్నారు. అయితే దేశంలో ఈ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయని, అదానీ, అంబానీ వంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తలకే పెట్టుబడుల అవకాశాలు పరిమితమవుతున్నాయని విమర్శించారు. ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయకుండా దేశం ఆర్థికంగా పురోగమించలేదని స్పష్టం చేశారు.

భారత్‌లో విద్యార్థుల నిరసనలపై స్పందిస్తూ.. అవి ఒక్కసారిగా పుట్టుకొచ్చిన ఉద్యమాలు కావని అన్నారు. గత పదేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. సంపద, అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడంతో ఆదివాసీలు, దళితులు, రైతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరల ప్రభావం రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఒక కారణమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *