న్యూఢిల్లీ: నిరసన ప్రదర్శనల సమయంలో జర్నలిస్టులకు కల్పించే ప్రత్యేక రక్షణలు, సౌకర్యాలు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, రీల్ మేకర్లకు వర్తించవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు వేర్వేరు కేటగిరీలకు చెందినవారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

జంతర్ మంతర్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్‌తో పాటు పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి.

ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, జాయింట్ కమిషనర్ సురేంద్ర కుమార్ తరఫున పోలీసులు కౌంటర్ అఫిడవిట్ సమర్పించారు. నిరసన సమయంలో యూట్యూబ్, సోషల్ మీడియా కోసం వీడియోలు రూపొందించే పలువురు కెమెరాలు, మైక్రోఫోన్లతో అక్కడికి వచ్చారని తెలిపారు. దీంతో అసలైన జర్నలిస్టులకు, రీల్ మేకర్లకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టమైందని వివరించారు.

అధికారిక మీడియా పాత్రను తాము పూర్తిగా గౌరవిస్తామని, అయితే కేవలం సోషల్ మీడియా కంటెంట్ రూపొందించేందుకు కెమెరాలు, మైక్రోఫోన్లు తీసుకొచ్చే వారికి జర్నలిస్టులకు వర్తించే మార్గదర్శకాలు వర్తించవని పోలీసులు పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

నిరసనల సమయంలో ప్రెస్ కేటగిరీ కింద జర్నలిస్టులు, రిపోర్టర్లకు కల్పించే రక్షణ పరిధిని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వర్తింపజేయలేమని అఫిడవిట్‌లో తెలిపారు. రీల్ మేకర్లకు కూడా జర్నలిస్టుల హోదా, రక్షణ కల్పించాలా లేదా అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయించాలని సూచించారు. వేలాది మంది నిరసనకారులు ఒకేచోట గుమిగూడినప్పుడు పరిస్థితులను నియంత్రించడం సవాలుగా ఉంటుందని ఢిల్లీ పోలీసులు తమ వాదనలో పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *