
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love)పై ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పుస్తకంలో చరిత్రను వక్రీకరించడంతో పాటు, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శివసేన నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా పుస్తకంలోని సావర్కర్‌ను కించపరిచేలా ఉన్న అంశాలకు సంబంధించిన పేజీలను చించివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివసేన నేతలు షైనా ఎన్‌సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితరులు పాల్గొన్నారు.
సోనియా గాంధీ ఆత్మకథలోని 201, 443 పేజీల్లో ఉన్న వివాదాస్పద అంశాలను తొలగించాలని పుస్తక ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్‌ను శివసేన నాయకులు డిమాండ్ చేశారు. చారిత్రక వ్యక్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలను సహించేది లేదని వారు స్పష్టం చేశారు.
