శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని జంగల్‌పురా గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో అతడి మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. మరోవైపు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. దీనిపై తుది నివేదికను ఆర్మీ అధికారులు వెల్లడించనున్నారు.

భద్రతా బలగాల కథనం ప్రకారం.. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన లతీఫ్ భట్‌ను బలగాలు వెంబడించాయి. జంగల్‌పురా గ్రామంలోని ఓ మసీదులో అతడు తలదాచుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వీడియో కాల్ ద్వారా అతడిని లొంగిపోవాలని భద్రతా సిబ్బంది కోరినప్పటికీ, అతడు నిరాకరించినట్లు సమాచారం. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని బలగాలు విజ్ఞప్తి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మసీదులో ఉదయం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో మసీదుకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. లతీఫ్ భట్ కశ్మీర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడిగా, స్థానికంగా చురుకుగా ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాదిగా భద్రతా సంస్థలు గుర్తించాయి.

ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ హతమైన విషయం తెలిసిందే. ఈ నెల 11న సీఆర్పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడిలో దార్, లతీఫ్ భట్ నిందితులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పేర్కొనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో దార్ ఇటీవల చేరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా లతీఫ్ భట్‌కు దార్ ఆశ్రయం కల్పించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *