
జమ్మూ కశ్మీర్‌కు చెందిన లతీఫ్ భట్ ఏడాది క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సమాచారం. అప్పటి నుంచి కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. వారం రోజుల క్రితం దార్ అనే మరో ఉగ్రవాదితో కలిసి సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో దార్‌ను హతమార్చిన భద్రతా బలగాలు.. తాజాగా బుధవారం జరిగిన మరో ఆపరేషన్‌లో లతీఫ్ భట్‌ను కూడా మట్టుబెట్టాయి.
లతీఫ్ ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో అతడు హతమైనట్లు సమాచారం.
వారం రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ సైనిక చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. బైక్‌పై వచ్చిన దుండగులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.
ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన భద్రతా బలగాలు కీలక వివరాలను గుర్తించాయి. సైనిక చెక్‌పోస్టుపై కాల్పులకు పాల్పడింది లష్కరే తోయిబా టాప్ కమాండర్ లతీఫ్ భట్, అతడి సహచరుడు ఉమర్ నిసాద్ దార్గా గుర్తించినట్లు వెల్లడైంది. దీంతో వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగించాయి. ఈ క్రమంలో సోమవారం లారు బైపాస్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఉమర్ నిసాద్ దార్ హతమయ్యాడు. అయితే లతీఫ్ భట్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారంతో అతడు దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించిన భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
లతీఫ్‌ను లొంగిపోవాలని భద్రతా దళాలు పలుమార్లు కోరాయి. ఈ క్రమంలో కుల్గాం సీనియర్ ఎస్పీ అనయత్ అలీ స్వయంగా రంగంలోకి దిగారు. వీడియో కాల్ ద్వారా లతీఫ్‌తో మాట్లాడి లొంగిపోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘నువ్వు ఇంకా చిన్నవాడివి.. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపో’ అంటూ సూచించారు.
అయితే ఎస్పీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లొంగిపోయే ప్రసక్తే లేదని, చనిపోతే అల్లా దగ్గరకు వెళ్లాలని, తనకు అల్లానే దిక్కు అంటూ లతీఫ్ సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు లతీఫ్ ఓ మసీదులోకి ప్రవేశించి అక్కడే తలదాచుకున్నట్లు సమాచారం. ప్రార్థనా మందిరాన్ని ఆశ్రయంగా చేసుకున్న అతడు బుధవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి అతడిని మట్టుబెట్టినట్లు సమాచారం.
