
2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో సాండ్‌పేపర్‌తో బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించి కెమెరాలకు చిక్కిన ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్.. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఘటనపై కీలక విషయాలు వెల్లడించాడు. ఈ వ్యవహారం గురించి తనకు మాత్రమే కాకుండా జట్టులోని పలువురికి ముందే తెలుసని ఆరోపించాడు. అప్పట్లో జరిగిన పరిణామాలపై పూర్తి నిజాలు చెప్పలేకపోయానని అంగీకరించాడు.
డేవిడ్ వార్నర్ ఆలోచనతోనే కుట్ర?
బ్యాన్‌క్రాఫ్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో పోర్ట్ ఎలిజబెత్ టెస్టు సమయంలో బంతిని రివర్స్ స్వింగ్ చేయించాలనే ఉద్దేశంతో సాండ్‌పేపర్ ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. అప్పటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చాడని ఆయన పేర్కొన్నాడు. టీవీ కెమెరాల నిఘా తనపై ఎక్కువగా ఉండటంతో ఈ పని తాను చేయలేనని వార్నర్ చెప్పినట్లు వివరించాడు. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో, అది తప్పని తెలిసినా తాను ఈ చర్యకు అంగీకరించానని వెల్లడించాడు.
కోచ్‌లకు కూడా ముందే తెలుసా?
ఈ చర్చ జరిగిన సమయంలో అప్పటి ప్రధాన కోచ్ డారెన్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ అక్కడే ఉన్నారని బ్యాన్‌క్రాఫ్ట్ తెలిపాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చాడని, అయితే ఈ పనిలో భాగం కావడానికి ఇష్టపడలేదని తనకు గుర్తున్నట్లు చెప్పాడు. బంతిని రుద్దిన తర్వాత అది ఆశించిన స్థాయిలో రివర్స్ స్వింగ్ అవుతోందా లేదా అని ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి బౌలర్లు తనకు అభిప్రాయాలు చెప్పేవారని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో జట్టు మొత్తానికి అవగాహన ఉందన్నది ఆయన ప్రధాన వాదన.
ప్రెస్మీట్లో నిజం దాచాల్సి వచ్చిందని వెల్లడి
కేప్‌టౌన్ టెస్టులో బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతిని దెబ్బతీస్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అసలు విషయం బయటపెట్టకుండా ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని ఆయన పేర్కొన్నాడు. సాండ్‌పేపర్ ఉపయోగించినట్లు చెప్పకుండా, టేప్‌తో బంతిని మార్చినట్లు వివరణ ఇచ్చామని తెలిపాడు. ఈ విషయంలో అప్పటి బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు.
ఎనిమిదేళ్ల మౌనానికి కారణమిదే
ఈ వివాదంపై 2021లో తాను చేసిన వ్యాఖ్యల తర్వాత బౌలర్లు తమకు సాండ్‌పేపర్ వినియోగం గురించి తెలియదని ప్రకటనలు విడుదల చేయడం బాధ కలిగించిందని బ్యాన్‌క్రాఫ్ట్ చెప్పాడు. శిక్ష పూర్తయ్యాక దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ ‘సాబ్ర్’లో ఈ వివాదానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో పాటు, ఇటీవల ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు తనను మళ్లీ మాట్లాడేలా చేశాయని తెలిపాడు.
ఎనిమిదేళ్లుగా ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలను వెల్లడించకుండా మౌనంగా ఉన్నానని, ఇకపై వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని భావించి ఇప్పుడు తన వాదనను బయటపెట్టినట్లు బ్యాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. అయితే ఆయన చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా జట్టులోని పలువురు ఆటగాళ్లు గతంలో ఖండించారు. ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఆటగాళ్లు తమ వాదనలు వినిపించేందుకు స్వతంత్ర వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
