తెలంగాణలో ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో వాయిదా వేస్తూ.. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు. నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు కొత్త చేయూత పింఛన్ల పంపిణీని కూడా ప్రారంభించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త చేయూత పింఛన్ల నిధుల జమ కార్యక్రమాలను వాయిదా వేసింది. వాస్తవానికి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా ఈ కార్యక్రమాలను ఈ నెల 26కి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త చేయూత పింఛన్ల నిధుల జమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 26న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుండగా, కొత్త చేయూత పింఛన్ల నిధుల జమ కూడా చేపట్టనున్నారు.

తెలంగాణలో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో పాటు, 4,63,857 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పింఛన్ల నిధులను జమ చేయనుంది. ఈ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క.. సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్‌ను ఆదేశించారు. ఈ ఏడాది మహిళల కోసం ప్రత్యేకంగా చిలకపచ్చ రంగు చీరలను తయారు చేయించగా, ఇప్పటికే అవి జిల్లాలకు చేరుకున్నాయి. మరోవైపు పింఛన్ పత్రాల పంపిణీ కూడా పూర్తయింది.

ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సీఎం సిద్దిపేట పర్యటనలో భాగంగా మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, ఇప్పటికే పూర్తయిన రూ.92.98 కోట్ల విలువైన పనులను ప్రారంభించనున్నారు.

దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరో ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వీటితో పాటు చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *