ఆంధ్రప్రదేశ్‌కు అక్వాన్ తుపాను ముప్పు తగ్గింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. తొలుత మచిలీపట్నం–చెన్నై మధ్య, ఆ తర్వాత కాకినాడ–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే తాజా మార్పులతో తుపాను పయనం ఒడిశా వైపు మళ్లింది.

గత ఆరు గంటలుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. ప్రస్తుతం నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 580 కిలోమీటర్లు, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

శుక్రవారం మధ్యాహ్నం నరసాపురం–పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *