
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం కావడంతో ఆ దేశ చమురు శుద్ధి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్టోబర్ చివరి నుంచి జరుగుతున్న దాడుల ప్రభావంతో రష్యా రిఫైనరీల్లో ముడి చమురు ప్రాసెసింగ్ గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాల అంచనాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్లో చమురు శుద్ధి కార్యకలాపాలు భారీగా పడిపోవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతను ఎదుర్కొంటున్న రష్యాకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
35 ప్రధాన రిఫైనరీల్లో 15 కేంద్రాలపై ప్రభావం
రష్యాలోని 35 ప్రధాన చమురు శుద్ధి కేంద్రాల్లో 15 రిఫైనరీల కార్యకలాపాలు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా నిలిచిపోయినట్లు లేదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం మధ్య నాటికి ఈ సంఖ్య తొమ్మిదిగా ఉండగా, తాజాగా 15కు చేరింది.
అక్టోబర్ చివరి నాటికి రోజుకు 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్న ముడి చమురు ప్రాసెసింగ్ ప్రస్తుతం సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గినట్లు అంచనా. అంటే రోజువారీ ప్రాసెసింగ్ పరిమాణంలో భారీ కోత నమోదైంది.
శుద్ధి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం
దాడులకు గురైన రిఫైనరీల మొత్తం నామమాత్రపు శుద్ధి సామర్థ్యం రోజుకు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేస్తున్నారు. ఇది రష్యా మొత్తం ప్రాథమిక చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 54 శాతానికి సమానం. దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 9.30 లక్షల మెట్రిక్ టన్నుల శుద్ధి సామర్థ్యం ఉంది.
అయితే రిఫైనరీలపై దాడులు, కార్యకలాపాల్లో అంతరాయాల కారణంగా నవంబర్లో సగటు ముడి చమురు ప్రాసెసింగ్ రోజుకు 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పోలిస్తే ఇది 5 నుంచి 10 శాతం తక్కువ.
ఒకవైపు చమురు శుద్ధి సామర్థ్యం తగ్గడం, మరోవైపు ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతుండటంతో రష్యా ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోంది. డ్రోన్ దాడులు కొనసాగితే దేశీయంగా ఇంధన సరఫరాపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
