
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ పాలక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
బుధవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తులకు దర్శన ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజులకు సంబంధించి ఎస్ఎస్డీ టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. తొలి రెండు రోజులు సర్వదర్శనం ఉండదని, అనంతరం ఎనిమిది రోజుల పాటు సర్వదర్శనం అమలు చేస్తామని వివరించారు.
అలిపిరి–ఎస్వీ జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో యాత్రికుల టౌన్షిప్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, డిజైన్ల తయారీతో పాటు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపులో భాగంగా 2007 సీనియారిటీ జాబితా ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనంగా 321 మంది పారిశుద్ధ్య కార్మికులు, 27 మంది సూపర్వైజర్లను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 348 మంది సిబ్బందిని పొరుగు సేవల విధానంలో నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
