ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆమె సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు కేవలం 24 గంటలు కూడా గడవకముందే తిరిగి సొంత పార్టీలోకి వెళ్లిపోయారు. వీసం నానాజీ, వీసం దేవి ఇటీవల మంత్రి అనిత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

అయితే పార్టీలో చేరిన మరుసటి రోజే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే మంత్రి సమక్షంలో టీడీపీలో చేరామని, తాము చేసిన పొరపాటును గుర్తించి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. ఇద్దరూ కలిసి మళ్లీ వైఎస్సార్‌సీపీ గూటికి చేరడంతో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి అనిత సొంత మండలమైన నక్కపల్లిలో రెండు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ సోదరుడు వీసం నానాజీ పెదబోదుగల్లం ఎంపీటీసీగా, ఆయన భార్య వీసం దేవి రేబాక ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించారు.

అయితే తాజాగా ఈ దంపతులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి హోంమంత్రి అనిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీసింది. కానీ టీడీపీలో చేరిన 24 గంటలు కూడా గడవకముందే వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ పార్టీ మార్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో వీసం నానాజీ, ఆయన భార్య వీసం దేవి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అనిత వారిద్దరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి నాయకుల నుంచి మద్దతు పెరుగుతోందని అనిత పేర్కొన్నారు. నక్కపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందంటూ ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పాయకరావుపేటలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఐక్యంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

అయితే టీడీపీలో చేరిన 24 గంటలు కూడా గడవకముందే నానాజీ, దేవి దంపతులు మరోసారి పార్టీ మారారు. తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ వారికి పార్టీ కండువాలు కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ.. హోంమంత్రి అనిత పిలుపు మేరకే తాము టీడీపీలో చేరామని వెల్లడించారు. అయితే తమ కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము పార్టీ మారిన విషయం తెలిసి పలువురు ఫోన్లు చేసి అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాధపడ్డామని చెప్పారు. తమ నిర్ణయం తప్పని తెలుసుకుని తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వివరించారు. ఇకపై వీసం కుటుంబమంతా కలిసికట్టుగా ఉంటుందని, తమ కుటుంబం కార్యకర్తలకు అండగా నిలుస్తుందని నానాజీ పేర్కొన్నారు.

దీంతో మంత్రి అనిత సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు ఎంపీటీసీలు ఒక్కరోజు కూడా గడవకముందే తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడం పాయకరావుపేట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *