
విశాఖపట్నం రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. నగర స్థాయికి అనుగుణంగా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫారాలను 14కు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ విస్తరణతో పాటు అదనంగా ఆరు కొత్త రైల్వే లైన్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
రైళ్ల రాకపోకలను మరింత వేగంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే రైళ్ల నిర్వహణలో సామర్థ్యం పెరగడంతో పాటు భద్రత కూడా మెరుగుపడనుంది.
మరోవైపు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని విశాఖ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ విస్తరణ పూర్తయితే విశాఖపట్నం నుంచి ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. విశాఖ నగర ప్రాధాన్యతకు, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 80 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీతో పాటు అదనపు రైళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
14 ప్లాట్‌ఫారాలు.. ఆరు కొత్త రైల్వే లైన్లు!
స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫారాలను 14కు పెంచేందుకు విస్తరణ పనులు చేపడుతున్నారు. అదనంగా ఆరు కొత్త రైల్వే లైన్లను కూడా నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపేందుకు, ప్రయాణికుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు అవకాశం ఏర్పడనుంది.
మరోవైపు రైళ్ల రాకపోకలను వేగంగా, మరింత సురక్షితంగా నిర్వహించేందుకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వే కార్యకలాపాల నిర్వహణలో సామర్థ్యం పెరగనుంది.
ఈ అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో ఆధునికీకరణ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
విశాఖపట్నం రైల్వే ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న రైళ్ల రాకపోకల సమస్యకు ఈ ఆధునికీకరణ ప్రాజెక్టుతో పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం కోచింగ్ యార్డు నిర్మాణ విధానం కారణంగా టెర్మినేటింగ్ రైళ్లు, ఇతర మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఒకే ట్రాక్‌లను దాటాల్సి వస్తోంది. దీంతో ప్లాట్‌ఫారాల అందుబాటు తగ్గిపోవడమే కాకుండా, స్టేషన్ వెలుపల అప్రోచ్ సిగ్నళ్ల వద్ద రైళ్లు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. తాజా విస్తరణ పనులు పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్యలకు గణనీయంగా చెక్ పడనుంది.
450 కార్లు.. 2 వేల బైక్‌లకు పార్కింగ్ సదుపాయం!
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు స్టేషన్ తూర్పు వైపున కొత్త ప్రవేశ ద్వారాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని కూడా మరింత అనువైన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వాహనదారులు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారీ పార్కింగ్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ కొత్త పార్కింగ్ ప్రాంతంలో ఒకేసారి 450 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలను నిలిపేలా సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పనులు పూర్తయితే విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు రాకపోకలతో పాటు వాహనాల పార్కింగ్ కూడా మరింత సులభతరం కానుంది
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఆధునికీకరణ, విస్తరణ పనుల పురోగతిని విశాఖ ఎంపీ భరత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేషన్‌లోని వివిధ నిర్మాణ ప్రాంతాలను సందర్శించి పనుల తీరును సమీక్షించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విశాఖ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేలా ప్రతి పనిని పక్కా ప్రణాళికతో చేపట్టాలని స్పష్టం చేశారు.
విశాఖ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఆధునిక రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
