• చామగడ్డలు – ½ కిలో
  • ఉప్పు – తగినంత
  • వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – ½ టేబుల్ స్పూన్
  • పసుపు – ¼ టీస్పూన్
  • కారం – 1 టేబుల్ స్పూన్
  • పెరుగు – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • కరివేపాకు – 2 రెబ్బలు
  • నిమ్మరసం – 1 నిమ్మకాయ
  • బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
  • రెడ్ ఫుడ్ కలర్ – కొద్దిగా (ఐచ్ఛికం)
  • డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం

1. ముందుగా చామగడ్డ ఉడికించుకోవాలి

అరకిలో చామగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. కొద్దిగా నీరు, ఉప్పు వేసి మూత పెట్టి మీడియం మంటపై 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చామగడ్డలు పూర్తిగా మెత్తబడకుండా సుమారు 80 శాతం మాత్రమే ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికిస్తే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది.

2. ముక్కలుగా కట్ చేసుకోవాలి

కుక్కర్‌లో ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత చామగడ్డలను బయటకు తీసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి, మీకు నచ్చిన విధంగా పొడవాటి ముక్కలుగా లేదా కాస్త మందంగా ఉండే చక్రాలుగా కోసుకోవాలి.

3. మసాలా మిశ్రమం సిద్ధం చేసుకోవాలి

ఒక పెద్ద గిన్నెలో చామగడ్డ ముక్కలు వేసి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసం పిండాలి. కావాలనుకుంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.

ఇప్పుడు ముక్కలు విరిగిపోకుండా అన్నింటినీ నెమ్మదిగా కలపాలి. మసాలాలన్నీ చామగడ్డ ముక్కలకు బాగా పట్టేలా చూసుకోవాలి.

4. క్రిస్పీగా రావడానికి ఈ చిట్కా పాటించండి

మసాలాలు పట్టిన చామగడ్డ ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. పిండి ముక్కలకు పలుచగా పట్టేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు.

ముఖ్యంగా చామగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాతే మసాలాలు కలపాలి. వేడిగా ఉన్నప్పుడే మసాలాలు వేస్తే తేమ బయటకు వచ్చి కోటింగ్ సరిగ్గా పట్టకపోవచ్చు. చల్లారిన ముక్కలకు పిండి కోటింగ్ ఇస్తే మంచి క్రిస్పీ టెక్చర్ వస్తుంది.

5. గోల్డెన్ బ్రౌన్‌గా వేయించుకోవాలి

బాణలిలో నూనె పోసి బాగా వేడయ్యాక మసాలా పట్టించిన చామగడ్డ ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకూడదు. మీడియం మంటపై సుమారు రెండు నిమిషాల పాటు కదపకుండా వేయించాలి. ఆ తర్వాత నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా ఎర్రగా, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.

ముక్కలు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత నూనె నుంచి తీసి టిష్యూ పేపర్‌పై వేయాలి.

వేడి వేడి చామగడ్డ 65 రెడీ!

అంతే.. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే టేస్టీ చామగడ్డ 65 సిద్ధం. వేడి వేడి పప్పు, పప్పుచారు, సాంబార్ లేదా రసంతో కలిపి తింటే ఆ రుచే వేరు. చికెన్ 65, ఆలూ 65లకు భిన్నంగా ఉండే ఈ వెరైటీ స్నాక్‌ను ఇంట్లో అందరికీ చేసి పెట్టండి.

చిన్న చిట్కా: చామగడ్డ ముక్కలను నూనెలో వేసిన వెంటనే గరిటతో కదపకండి. కోటింగ్ ఊడిపోకుండా ఉండాలంటే కొద్దిసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత నెమ్మదిగా తిప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *