విజయనగరం: వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో ఎంపీపీ ఎన్నికలు గట్టి షాక్‌ ఇచ్చాయి. విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జిల్లాలోని మొత్తం 27 ఎంపీపీ స్థానాలకు గానూ 25 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వైసీపీ కేవలం గరివిడి మండలంలో మాత్రమే విజయం సాధించింది.

అయితే, వైసీపీ గెలుచుకున్న ఏకైక గరివిడి ఎంపీపీ స్థానంలోనూ అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. తనకు వైస్‌ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పారని ఆరోపిస్తూ ఎంపీటీసీ సభ్యుడు బొంపల్లి వెంకటరావు రాజీనామా చేశారు. త్వరలో తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

మరోవైపు, భోగాపురం ఎంపీపీ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ప్రొసీడింగ్‌ అధికారి ఎం. రామారావు ప్రకటించారు. ఈ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

గుర్ల ఎంపీపీ స్థానానికి జరిగిన ఎన్నికలో ఇరు పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో అధికారులు లాటరీ నిర్వహించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి వెన్ని సన్యాసినాయుడు విజయం సాధించి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇక విజయనగరం ఎంపీపీగా కోరాడ తులసి ఎన్నికయ్యారు.

మొత్తంగా విజయనగరం జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *