D Spiritual: Nov 20: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి ఆన్‌లైన్ వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన కొత్త ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ వేలం నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది.

టీటీడీ అధికారుల వివరాల ప్రకారం, ఈ విడత వేలంలో మొత్తం 115 లాట్ల కొత్త ఆర్ట్ సిల్క్ చీరలను అందుబాటులో ఉంచారు. వీటికి 28814 నుంచి 28819 వరకు ఈ-వేలం ఐడీ నంబర్లను కేటాయించారు. భక్తులు కానుకగా సమర్పించిన ఈ చీరలను పారదర్శకంగా, క్రమబద్ధమైన పద్ధతిలో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు.

ఈ-వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల బిడ్డర్లు ముందుగా ఏపీ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ konugolu.ap.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న వారికి మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ వేలం విభాగం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 0877-2264429, 9959988470 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ tirumala.orgలో కూడా పరిశీలించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *