ఉన్నత విద్యలో సంప్రదాయ బోధనకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి తొలుత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాల్లో ఆన్‌లైన్‌ కోర్సులను రూపొందించింది. త్వరలో అన్ని పాఠ్యాంశాలను కూడా ఆన్‌లైన్‌ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. విజయభాస్కరరావు ఈ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. విద్యార్థులు apschelmsmoocs.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని తమకు ఆసక్తి ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా కోర్సులను స్వీయ అభ్యసన పద్ధతిలో పూర్తిచేసుకునే వెసులుబాటు ఉంది.

ఏఐ ఇంట్రడక్షన్‌, ఏఐ అప్లికేషన్స్‌ (బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌), కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఫౌండేషన్స్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నాలుగు నెలల్లో పూర్తిచేసుకోవచ్చు.

కోర్సు పూర్తయిన అనంతరం ఉన్నత విద్యామండలి నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రంతో పాటు రెండు క్రెడిట్లు అందజేస్తారు. ఈ క్రెడిట్లు విద్యార్థుల విద్యార్హతలకు అదనపు విలువను చేకూర్చడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలకు కూడా ఉపయోగపడనున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *