
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి తన నిర్ణయంతో చర్చల్లో నిలిచాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న టోటల్ చెస్ పైలట్ టోర్నీలో ప్రత్యర్థులతో ఆడుతున్న మ్యాచ్‌ల మధ్య కొన్ని గేమ్స్‌ను వదిలేస్తూ వస్తున్నాడు. గత రౌండ్‌లో కజకిస్థాన్ ప్లేయర్ బిబిసారా అస్సౌబయేవాతో జరిగిన పోరులో ఫాస్ట్ క్లాసికల్ గేమ్‌లకు రెండుసార్లు దూరంగా ఉన్న కార్ల్‌సన్.. తాజాగా రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిస్లావ్ ఆర్టెమియేవ్‌తోనూ ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించాడు.
గురువారం ఆర్టెమియేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట నాలుగు బ్లిట్జ్ గేమ్స్ ఆడిన కార్ల్‌సన్.. ఆ తర్వాత రెండు ర్యాపిడ్ గేమ్స్‌కు హాజరుకాలేదు. చివర్లో జరిగే ఫాస్ట్ క్లాసికల్ గేమ్ ఆడేందుకు తిరిగి బోర్డు వద్దకు వచ్చాడు. ఈ విషయాన్ని నార్వే మీడియా సంస్థ TV2తో మాట్లాడుతూ స్వయంగా వెల్లడించాడు.
ర్యాపిడ్ గేమ్స్ వదిలేసి.. క్లాసికల్‌లో విజయం
టోటల్ చెస్ టోర్నీ నిబంధనల ప్రకారం నాకౌట్ దశలో ఇద్దరు ఆటగాళ్లు నాలుగు బ్లిట్జ్, రెండు ర్యాపిడ్, ఒక ఫాస్ట్ క్లాసికల్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. మరుసటి రోజు రంగులు మార్చుకుని మరోసారి ఇదే క్రమంలో పోటీ పడతారు.
అయితే ర్యాపిడ్ గేమ్స్ ఆడటం కంటే క్లాసికల్ గేమ్ కోసం విశ్రాంతి తీసుకోవడమే తనకు మంచిదని కార్ల్‌సన్ అభిప్రాయపడ్డాడు. బ్లిట్జ్ గేమ్స్ ఆడటం ఆసక్తికరంగా ఉంటుందని, కానీ క్లాసికల్ పోటీకి ముందు ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
ఆర్టెమియేవ్‌తో జరిగిన తొలి నాలుగు బ్లిట్జ్ గేమ్స్‌లో కార్ల్‌సన్ మొదటి గేమ్ ఓడిపోయినా, ఆ తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి 3-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. ర్యాపిడ్ గేమ్స్‌కు గైర్హాజరు కావడంతో ప్రత్యర్థికి ఫోర్ఫీట్ ద్వారా ఎనిమిది పాయింట్లు లభించాయి. దీంతో ఫాస్ట్ క్లాసికల్ గేమ్‌కు ముందు కార్ల్‌సన్ 3-9తో వెనుకబడ్డాడు. ఈ కీలక గేమ్‌లో ఓడినా, డ్రా చేసుకున్నా అతడికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ఒత్తిడిని అధిగమించి క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించాడు.
కార్ల్‌సన్ తీరుపై ఆనంద్, కరువానా అసంతృప్తి
కార్ల్‌సన్ వ్యవహారశైలిపై భారత చెస్ దిగ్గజం, ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్ విశ్వనాథన్ ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు తమకు నచ్చిన గేమ్స్ మాత్రమే ఆడటం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డాడు. అబిమన్యు మిశ్రా, రిచర్డ్ రాపోర్ట్ కూడా నిబంధనల్లోని వెసులుబాటును ఉపయోగించుకున్నారని గుర్తుచేశాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా కూడా కార్ల్‌సన్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. మ్యాచ్ మధ్యలో ఆటకు దూరమై, మళ్లీ చివరి గేమ్‌కు రావడం సరికాదని అన్నాడు. ఉద్దేశపూర్వకంగా కొన్ని గేమ్స్ ఆడకూడదని నిర్ణయించుకుంటే, ఆ మ్యాచ్ మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిణామాలతో చెస్ టోర్నీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు.
రేటింగ్ కోల్పోతాననే భయంతోనేనా?
బిబిసారా అస్సౌబయేవాతో జరిగిన గత మ్యాచ్‌లలోనూ కార్ల్‌సన్ ఫాస్ట్ క్లాసికల్ గేమ్స్ ఆడకపోవడం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉన్నందున చివరి గేమ్ ఆడాల్సిన అవసరం లేదన్నది అతడి వాదన. అయితే క్లాసికల్ రేటింగ్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బుడాపెస్ట్ టోర్నీలో గత వారం రోజుల్లో 21 రేటింగ్ పాయింట్లు కోల్పోయిన కార్ల్‌సన్.. లైవ్ రేటింగ్స్‌లో 2801.2 పాయింట్లతో ఉన్నాడు. అతడి రేటింగ్ 2800 దిగువకు పడిపోతే ప్రపంచ రెండో ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా ప్రపంచ నంబర్‌వన్ స్థానానికి చేరే పరిస్థితి ఏర్పడుతుంది.
తాజాగా ఆర్టెమియేవ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కార్ల్‌సన్ అనుసరించిన వ్యూహం చెస్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
