
న్యూజిలాండ్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు విజయంతో బోణీ కొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో ఆతిథ్య జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ 25వ నిమిషంలో తొలి గోల్ నమోదు చేశాడు. అనంతరం సంజయ్ 43వ నిమిషంలో, శారదానంద్ 53వ నిమిషంలో గోల్స్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున జాంటీ 25వ నిమిషంలో, సామ్ హిహా 55వ నిమిషంలో గోల్స్ చేశారు. దీంతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరగనుంది.
వందేళ్ల క్రీడా బంధానికి గుర్తుగా టోర్నీ
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ హాకీ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి ‘ఇండియా-న్యూజిలాండ్ సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ ఈవెంట్’గా పేరు పెట్టారు.
ఇదే టోర్నీలో భాగంగా భారత త్రివిధ దళాల హాకీ జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఆక్లాండ్‌లోని లాయిడ్ ఎల్స్మీర్ పార్క్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ జట్టుపై భారత బృందం 4-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
1926లోనే భారత హాకీ జట్టు తొలి విదేశీ పర్యటన
భారత్, న్యూజిలాండ్ మధ్య హాకీ అనుబంధానికి దాదాపు శతాబ్ద కాలం చరిత్ర ఉంది. 1926లో భారత ఆర్మీ హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించి మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ పర్యటనలో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా అంతర్జాతీయ హాకీ సమాఖ్య గుర్తించింది.
ఈ చారిత్రక క్రీడా బంధానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా న్యూజిలాండ్ స్పోర్ట్‌తో కలిసి భారత హైకమిషనర్ మౌన్పుయి సయావి బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్ మంత్రి అప్టన్, పార్లమెంట్ సభ్యులు, మేయర్లు, ఇరు దేశాలకు చెందిన పలువురు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
