
జమ్మూకశ్మీర్‌కు 35 ఏళ్ల తర్వాత స్థానిక ఉగ్రవాదుల నుంచి విముక్తి లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇటీవల కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ హతమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటంలో ఈ పరిణామం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2026’లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టి దాన్ని పూర్తిగా నిర్మూలించాలని అధికారులకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి 303 మంది పరారీలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
కుల్గాం ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నవంబర్ 18న భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. ఓ మసీదులో దాక్కున్న అతడిని లొంగిపోవాలని భద్రతా బలగాలు కోరాయి. అయితే అందుకు నిరాకరించిన లతీఫ్ భట్ బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో అతడు మరణించాడు.
ఈ ఎన్‌కౌంటర్‌ను ఉగ్రవాదంపై పోరులో కీలక పరిణామంగా అభివర్ణించిన అమిత్ షా స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన దిశగా భద్రతా బలగాలు సాధిస్తున్న పురోగతికి ఈ పరిణామం నిదర్శనమని పేర్కొన్నారు.
