
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే వస్త్రాలు, ఇతర కానుకలు, బియ్యం తదితర వస్తువులను టీటీడీ ఎప్పటికప్పుడు వేలం వేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు వస్త్రాలకు సంబంధించి ఆన్లైన్ ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ వేలం ద్వారా విక్రయించనుంది.
ఆసక్తి ఉన్నవారు ఈ ఆన్లైన్ వేలంలో పాల్గొని వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు టీటీడీ వేలం ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టింది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనుంది.
మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలంలో విక్రయించనున్నారు. ఇందుకోసం 28814 నుంచి 28819 వరకు ఈ-వేలం ఐడీ నంబర్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసక్తి గల బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొనవచ్చు.
వేలం వివరాలు ఎక్కడ తెలుసుకోవాలి?
వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ (వేలములు) కార్యాలయం లేదా ఏఈవో (వేలములు) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
అలాగే ఈ క్రింది మార్గాల్లోనూ సమాచారం పొందవచ్చు.
- ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్: https://konugolu.ap.gov.in
- టీటీడీ అధికారిక వెబ్సైట్: http://www.tirumala.org
- ఫోన్ నంబర్: 0877-2264429
ఆసక్తి ఉన్న బిడ్డర్లు నిర్ణీత గడువులో వేలం ప్రక్రియలో పాల్గొనాలని టీటీడీ సూచించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, వివిధ రకాల దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడతలవారీగా ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన తేదీలు, సమయాలను ప్రకటించింది.
టికెట్ల విడుదల షెడ్యూల్ ఇలా ఉంది:
- ఈ నెల 21న ఉదయం 10 గంటలకు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటా విడుదల.
- ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు: వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా విడుదల.
- ఈ నెల 23న ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల.
- ఈ నెల 23న ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల.
- ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల.
- ఈ నెల 24న ఉదయం 10 గంటలకు: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.
- ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటా విడుదల.
ఆన్లైన్లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చు. టికెట్ల విడుదల సమయానికి ముందుగానే వెబ్సైట్లో అందుబాటులో ఉండి బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో నవంబర్ 24న కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంతో పాటు శ్రీ కోదండరామాలయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబర్ 24న సాయంత్రం 6.30 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు.
అదే రోజు తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలోనూ కార్తీక దీపోత్సవం జరగనుంది. రాత్రి 8 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువస్తారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా కార్తీక దీపాలను వెలిగించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
