
D news:nov:20అమ్మ చేతి వంట అనగానే ముందుగా గుర్తొచ్చేవి వేడి వేడి ఇడ్లీలు, కమ్మని దోశలు, వాటితో పాటు నెయ్యి వేసుకొని తినే రుచికరమైన పొడులు. కారప్పొడి, కందిపొడి, కరివేపాకు పొడి.. ఇలా ఒక్కో పొడికి ఒక్కో ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా అమ్మ చేతులతో వేయించి, దంచి తయారు చేసిన ఈ పొడుల ఘుమఘుమలు తలుచుకుంటేనే నోరూరిపోతుంది. పొడి డబ్బా మూత తెరవగానే వచ్చే సువాసన ఆకలిని మరింత పెంచుతుంది.
ఉదయాన్నే బిజీగా ఉండి చట్నీలు తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఈ పొడులు ఎంతో ఉపయోగపడతాయి. వేడి వేడి ఇడ్లీలు, దోశలతో పాటు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడులను కలుపుకొని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు, కరివేపాకు, కందిపప్పు వంటి పదార్థాలతో తయారు చేసుకునే ఈ పొడులను మన అభిరుచికి తగినట్లుగా ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
బయట మార్కెట్లో లభించే పొడులపై ఆధారపడకుండా, మనకు నచ్చిన పదార్థాలను ఉపయోగించి శుభ్రంగా, తాజాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి అచ్చం అమ్మ చేతి వంట రుచిని గుర్తుచేసేలా కారప్పొడి, కందిపొడి, కరివేపాకు పొడులను ఏయే పదార్థాలతో, ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
- ఎండుమిర్చి – 15 నుంచి 20 (కారం మీ అభిరుచికి తగినట్లు)
- శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- మినపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 10 నుంచి 12
- చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు
- కరివేపాకు – 2 రెమ్మలు
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఉప్పు – తగినంత
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి.
- నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
- తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
- వేయించిన పదార్థాలన్నింటినీ ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన పదార్థాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, తగినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే! ఎంతో రుచికరమైన, ఘాటైన కారప్పొడి సిద్ధం! ❤️
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కారప్పొడి కలుపుకుని తింటే అదిరిపోయే రుచి. ఇడ్లీ, దోశెల్లోకి కూడా చాలా బాగుంటుంది!
