గంపలగూడెం: సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ సామాజిక వర్గంలోని రెండు వర్గాలకు కీలక పదవులు కేటాయించిన గంపలగూడెం మండలం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించడం ద్వారా సామాజిక సమతుల్యతకు గంపలగూడెం నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.

గురువారం గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా ఎన్నికైన ఎంపీపీ బూరుగు అంజలి, వైస్ ఎంపీపీ చెరుకూరి సాయి చంద్, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గంలోని రెండు వర్గాలకు మండల స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఓసీ మహిళకు కేటాయించిన జడ్పీటీసీ స్థానాన్ని సైతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో పదవుల కంటే సామాజిక సమతుల్యత, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ముఖ్యమని స్పష్టం చేశారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గంపలగూడెంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు సైతం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత, జడ్పీటీసీ కోట పుల్లమ్మ, కూటమి నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, యనమద్ది పుల్లయ్య చౌదరి, దేవభక్తుని సీతారాం ప్రసాద్, మానుకొండ రామకృష్ణ, చింతలపాటి వెంకట కృష్ణారావు, రేగళ్ల వీరారెడ్డి, డి.వి. కృష్ణారావు, బూరుగు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *