
‘క్లాడ్’ ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన అమెరికా సంస్థ ఆంథ్రోపిక్ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ గురువారం అమెరికా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది భారతదేశంలోని మార్కెట్ విలువ పరంగా టాప్-10 కంపెనీల మొత్తం విలువ కంటే కూడా గణనీయంగా ఎక్కువ. దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువతో పోలిస్తే ఆంథ్రోపిక్ విలువ దాదాపు పది రెట్లు అధికంగా ఉండటం విశేషం.
ఈ పరిణామంపై ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత కంపెనీల మార్కెట్ విలువను తక్కువగా అంచనా వేస్తున్నారా? లేక ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనం వెనుకబడుతున్నామా? అని ప్రశ్నించారు.
ఐపీఓ ధర కంటే 34 శాతం అధికంగా లిస్టింగ్
ఆంథ్రోపిక్ తన ఐపీఓలో ఒక్కో షేరు ధరను 83 డాలర్లుగా నిర్ణయించింది. అయితే గురువారం నాస్డాక్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు షేరు ధర 111.50 డాలర్లకు చేరింది. అంటే ఐపీఓ ధరతో పోలిస్తే దాదాపు 34 శాతం అధికంగా నమోదైంది. ఆ తర్వాత షేరు ధరలో ఒడుదొడుకులు కనిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 97.17 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ పూర్తి విలువ (Fully Diluted Valuation) సుమారు 1.75 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో మాత్రం 2 లక్షల కోట్ల డాలర్ల మార్కును తాకింది.
రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ
ఈ ఐపీఓ ద్వారా ఆంథ్రోపిక్ సుమారు 98 కోట్ల షేర్లను విక్రయించి 81.3 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించింది. ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలిచింది. గతంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల రికార్డును ఆంథ్రోపిక్ అధిగమించింది. అంతేకాకుండా, ఐపీఓతో పాటు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా మరో 26 బిలియన్ డాలర్లు సమీకరించడంతో మొత్తం నిధుల సమీకరణ 107.3 బిలియన్ డాలర్లకు చేరింది.
భారతీయులు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చా?
ఆంథ్రోపిక్ ఐపీఓలో భారతదేశాన్ని అంతర్జాతీయ రిటైల్ ఆఫరింగ్ పరిధిలో చేర్చకపోవడంతో దేశీయ మదుపర్లకు నేరుగా దరఖాస్తు చేసే అవకాశం లభించలేదు. అయితే నాస్డాక్లో షేర్లు లిస్టయిన తర్వాత అర్హత కలిగిన భారతీయులు అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వాటిని కొనుగోలు చేయవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరళీకృత చెల్లింపుల పథకం (LRS) కింద విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ వద్ద ఖాతా తెరిచి, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం భారతీయ బ్యాంకు ఖాతా నుంచి బ్రోకరేజీ ఖాతాకు నిధులు బదిలీ చేసి, అమెరికా డాలర్లలో షేర్ల కొనుగోలు లేదా విక్రయ ఆర్డర్లు ఇవ్వవచ్చు.
అయితే విదేశీ షేర్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఎల్ఆర్ఎస్ పరిమితులు, విదేశీ మారకపు నిబంధనలు, పన్ను బాధ్యతలను తప్పనిసరిగా పరిశీలించాలి. భారీ మార్కెట్ విలువతో లిస్టయినప్పటికీ, షేరు ధరలో ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉన్నందున పెట్టుబడి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
