
బ్రాండ్ విలువ, పేటెంట్లు, మేధో సంపత్తి, కస్టమర్ సంబంధాలు వంటి అదృశ్య ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ ఇంటాజిబుల్ ఫైనాన్స్ ట్రాకర్ (GIFT 2026) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రిలయన్స్‌కు చెందిన అదృశ్య ఆస్తుల విలువ 135.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12.76 లక్షల కోట్లు)గా ఉంది. భారతీయ కంపెనీల మొత్తం అదృశ్య ఆస్తుల విలువ 3.76 లక్షల కోట్ల డాలర్లకు చేరడంతో ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
భారత కంపెనీల మొత్తం ఎంటర్‌ప్రైజ్ విలువ 5.49 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా, అందులో అదృశ్య ఆస్తుల వాటా 68 శాతంగా నమోదైంది. ఈ శాతం చైనా (60%), జపాన్ (49%), దక్షిణ కొరియా (62%) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాకుండా, భారత కంపెనీల ఎంటర్‌ప్రైజ్ విలువలో దాదాపు 65 శాతం వాటా బ్యాలెన్స్ షీట్లలో పూర్తిగా ప్రతిబింబించని అదృశ్య ఆస్తుల రూపంలో ఉందని నివేదిక పేర్కొంది.
అదానీ పవర్, బజాజ్ ఆటోకు భారీ వృద్ధి
అదృశ్య ఆస్తుల విలువలో పలు భారతీయ సంస్థలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. అదానీ పవర్ విలువ 76 శాతం పెరగ్గా, బజాజ్ ఆటో 40 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 శాతం వృద్ధిని సాధించాయి. మరోవైపు ఐటీ రంగంలోని దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రం క్షీణతను ఎదుర్కొన్నాయి. వీటి అదృశ్య ఆస్తుల విలువ వరుసగా 31 శాతం, 32 శాతం తగ్గింది.
ప్రపంచ టాప్-100లో చోటు కోల్పోయిన రిలయన్స్, ఎయిర్‌టెల్
దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉండగా, 131.4 బిలియన్ డాలర్ల అదృశ్య ఆస్తుల విలువతో భారతి ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలిచింది. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఈ రెండు సంస్థలు టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయాయి. గత ఏడాది రిలయన్స్ 82వ స్థానంలో, ఎయిర్‌టెల్ 94వ స్థానంలో ఉన్నాయి. ఈసారి టాప్-100లోకి ప్రవేశించేందుకు అవసరమైన కనీస విలువ సుమారు 164 బిలియన్ డాలర్లకు పెరగడంతో ఈ కంపెనీలు జాబితా నుంచి బయటకు వచ్చాయి.
సెమీకండక్టర్ రంగం దూకుడు
ప్రపంచవ్యాప్తంగా అదృశ్య ఆస్తుల విలువలో సెమీకండక్టర్ రంగం కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ రంగాన్ని వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరింది. ఈ రంగానికి సంబంధించిన అదృశ్య ఆస్తుల విలువ 90 శాతం పెరిగి 18.3 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు GIFT 2026 నివేదిక వెల్లడించింది. ఏఐ, చిప్ తయారీ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
