
భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ రెండో కక్ష్య ప్రయోగం కోసం భారత్, జర్మనీ, ఇటలీకి చెందిన సంస్థలతో చేతులు కలిపింది. ఈ మిషన్‌లో భాగంగా హెచ్ఈఎక్స్20 (HEX20), జర్మనీకి చెందిన ఎక్సోలాంచ్ (Exolaunch), ఇటలీ సంస్థ ఓమ్స్పేస్ (OhmSpace) భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. ఈ నాలుగు సంస్థలు తమ సాంకేతిక సామర్థ్యాలను కలిపి ఉపగ్రహ ప్రయోగం, అంతరిక్షంలో కొత్త ప్రొపల్షన్ సాంకేతికత పరీక్షకు సిద్ధమవుతున్నాయి.
ఒకే డిప్లాయర్లో రెండు ఉపగ్రహాలు
ఈ ప్రయోగంలో హెచ్ఈఎక్స్20 రూపొందించిన ‘నైలా-3’ (NILA III) ఉపగ్రహంతో పాటు స్కైరూట్‌కు చెందిన ‘స్కోప్’ (SCOPE) ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలోకి పంపనున్నారు. ఈ రెండు 4U క్యూబ్‌శాట్ ఉపగ్రహాలను ఎక్సోలాంచ్ రూపొందించిన 8U డిప్లాయర్లో అమర్చి అంతరిక్షంలోకి పంపిస్తారు. రాకెట్ నిర్దేశిత కక్ష్యకు చేరుకున్న తర్వాత ఈ డిప్లాయర్ రెండు ఉపగ్రహాలను విడిగా విడుదల చేస్తుంది.
అంతరిక్షంలో ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష
ఈ మిషన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. నైలా-3 ఉపగ్రహంలో ఓమ్స్పేస్ అభివృద్ధి చేసిన అధిక ఉష్ణోగ్రత రెసిస్టోజెట్ ప్రొపల్షన్ వ్యవస్థను అమర్చనున్నారు. అంతరిక్షంలోనే ఈ సాంకేతికత పనితీరును పరీక్షించనున్నారు. భవిష్యత్తులో ఉపగ్రహాల కక్ష్య మార్పులు, కదలికలకు ఉపయోగపడే ఈ తరహా వ్యవస్థల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుంది.
జర్మనీలో కుదిరిన భాగస్వామ్య ఒప్పందం
జర్మనీలోని బ్రెమెన్ నగరంలో నిర్వహించిన స్పేస్ టెక్ ఎక్స్పో యూరప్-2026 కార్యక్రమంలో ఈ నాలుగు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అంతరిక్ష ప్రయోగాల్లో లాంచ్ సేవలు, ఉపగ్రహ తయారీ, డిప్లాయ్‌మెంట్ సాంకేతికత, ప్రొపల్షన్ వ్యవస్థలు కీలకమని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వివిధ సంస్థల మధ్య ఇలాంటి సహకారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
