మహబూబ్‌నగర్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు నీటిని తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన ఈ నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోసం కోయిల్ సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని కోరారు.

కోయిల్ సాగర్ నుంచి నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని 20 రోజుల క్రితమే తాము హెచ్చరించామని, ఇప్పటికే ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే ఇలాంటి ప్రతిపాదన ముందుకు వచ్చేది కాదని విమర్శించారు. వర్షాకాలంలోనూ పంటలకు సరిపడా నీటిని అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టుపై ఇప్పటికే నీటి ఒత్తిడి అధికంగా ఉందని, ఈ పరిస్థితుల్లో నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్దఎత్తున ఉద్యమిస్తామని, కొడంగల్‌కు నీటి తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు.

వాగుల్లో ఇసుక దోపిడీపై చూపుతున్న శ్రద్ధ రైతులకు సాగునీరు అందించడంలో లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కోయిల్ సాగర్ నింపేందుకు కరివెన రిజర్వాయర్ నుంచి కాలువ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని గుర్తుచేశారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్‌కు తాగునీటి అవసరాలు తీర్చుకోవాలని సూచించారు. కమీషన్ల కోసమే రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *