
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించేందుకు సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య పెద్దపల్లి, కాజీపేట మీదుగా నమో భారత్ లేదా మెము రైలు సర్వీసును ప్రారంభించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెమూ రైలు సుమారు 309 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుండటంతో గమ్యస్థానానికి చేరుకోవడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతోంది.
అయితే, ప్రత్యామ్నాయ మార్గంలో ఇప్పటికే రైల్వే లైన్లు అందుబాటులో ఉండటంతో కొత్త రైలు సర్వీసును ప్రవేశపెడితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్గంలో రైలు నడిపితే కేవలం 3.5 నుంచి 4 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు చేరుకోవచ్చని, తద్వారా ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని కోరుతున్నారు.
ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తర తెలంగాణ ప్రజలకు స్వగ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా నగరంలోని తూర్పు ప్రాంతాలైన ఘట్కేసర్, చర్లపల్లి, మౌలాలి, బోడుప్పల్, తార్నాక తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సు ప్రయాణాల్లో అధిక ఛార్జీలతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుండగా, రైలు ప్రయాణాలకు గంటల సమయం వెచ్చించాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా కరీంనగర్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలు సర్వీసును ప్రారంభించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు సైతం ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్-కరీంనగర్ మధ్య ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ప్రధాన రవాణా మార్గంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. కరీంనగర్ చేరుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. టికెట్ ధరలు కనీసం రూ.220 నుంచి ప్రారంభమవుతుండగా, లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు మరింత అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పండగలు, వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సీట్లు దొరకడం కూడా కష్టంగా మారుతోంది.
మరోవైపు, రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న కరీంనగర్-కాచిగూడ డెమూ ప్యాసింజర్ రైలు ప్రయాణికులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదు. ఈ రైలు జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మీదుగా సుమారు 309 కిలోమీటర్లు ప్రయాణిస్తూ చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటోంది. దీంతో ప్రయాణానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతోంది.
దీనికితోడు నిజామాబాద్-మేడ్చల్ మార్గంలో సింగిల్ రైల్వే లైన్ ఉండటం, గరిష్ఠ వేగపరిమితి గంటకు 110 కిలోమీటర్లుగా ఉండటంతో ప్రయాణ సమయం మరింత పెరుగుతోంది. ఫలితంగా బస్సులో నాలుగు గంటల్లో చేరుకునే గమ్యస్థానానికి రైలులో దాదాపు రెట్టింపు సమయం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
కరీంనగర్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు రైలు సర్వీసు ప్రారంభించేందుకు అవసరమైన రైల్వే మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి-కాజీపేట మధ్య మూడో రైల్వే లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, కాజీపేట నుంచి ఘట్కేసర్ వరకు రెండో లైన్, ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు నాలుగో రైల్వే లైన్ అందుబాటులో ఉన్నాయి.
పెద్దపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. అలాగే కరీంనగర్-పెద్దపల్లి మధ్య ఉన్న 35 కిలోమీటర్ల సింగిల్ రైల్వే లైన్‌పై కూడా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు అవకాశం ఉందని ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నవారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్-సికింద్రాబాద్ మధ్య పెద్దపల్లి, కాజీపేట మీదుగా నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలు సర్వీసును ప్రవేశపెడితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. సరైన రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే కేవలం 3 నుంచి 3.5 గంటల్లో లేదా గరిష్ఠంగా నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రతిపాదకులు చెబుతున్నారు.
కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు బస్సులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఉప్పల్, ఘట్కేసర్, చర్లపల్లి, మౌలాలి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే ఉత్తర తెలంగాణ ప్రజలకు తమ నివాసాలకు సమీపంలోని రైల్వే స్టేషన్ల నుంచే రాకపోకలు సాగించే వెసులుబాటు కలుగుతుంది. దీంతో నగరంలోని రద్దీ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు రోడ్డు ప్రయాణాలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
అదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట, సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ తరచూ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఈ రైలు సేవలు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి.
ఇప్పటికే ఈ మార్గంలో అవసరమైన రైల్వే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలు, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలు నడిపే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
