
అనంతపురం నగర మేయర్ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియపై వివాదం కోర్టుకు చేరింది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నేత అజేష్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో అనుమానాలు ఉన్నాయని, ఎన్నికల ఫలితాలపై స్పష్టత కోసం రీకౌంటింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గంటకు పైగా ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. కౌంటింగ్ ప్రక్రియపై తనకు అనుమానాలు ఉన్నాయని, అందుకే రీకౌంటింగ్ కోరుతున్నట్లు అజేష్ బాబు కోర్టుకు వివరించారు.
అనంతపురం నగర మేయర్ ఎన్నికల వివాదం న్యాయస్థానానికి చేరింది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత అజేష్బాబు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అత్యవసర పిటిషన్ (ఔట్ ఆఫ్ ఆర్డర్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం EAP 1/2026గా కేసు నంబరును కేటాయించింది.
ఈ సందర్భంగా అజేష్బాబు తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. మేయర్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందువల్ల ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అంతేకాకుండా, అజేష్బాబుకు అనుకూలంగా వచ్చిన పోస్టల్ ఓట్లను కూడా చెల్లని ఓట్లుగా పరిగణించారని పిటిషన్లో పేర్కొన్నారు.
అజేష్బాబుకు అనుకూలంగా వచ్చిన సాధారణ ఓట్లను సైతం చెల్లనివిగా ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, తమ అభ్యర్థికి సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. ఈ పిటిషన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో), మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, మేయర్‌గా ఎన్నికైన చిట్లూరు రమేష్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు తదుపరి విచారణను అనంతపురం జిల్లా కోర్టు డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
ఇదే వ్యవహారంలో మరో రెండు మధ్యంతర పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు మేయర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఒక పిటిషన్లో కోరారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, సీసీటీవీ ఫుటేజీలను విచారణ ముగిసే వరకు భద్రపరచాలని మరో పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ రెండు మధ్యంతర పిటిషన్లపై కోర్టు ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది.
కాగా, అనంతపురం మేయర్ ఎన్నికల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజేష్బాబుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ విజయం సాధించారు. అయితే ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, రిటర్నింగ్ అధికారి వ్యవహారశైలిపై అజేష్బాబు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా ఉండటం, ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీకి అసాధారణ మెజారిటీ రావడం, కౌంటింగ్ హాలులో బయటి వ్యక్తుల సంచారం, అదనపు కౌంటింగ్ గదుల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
