విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై తాజాగా మరో పిటిషన్‌ దాఖలైంది. అయితే, కుల ధ్రువీకరణ పత్రం అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, డిస్ట్రిక్ట్‌ లెవల్‌ స్క్రూట్నీ కమిటీ విచారణ చేపడుతున్నందున ఈ దశలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇదే సమయంలో ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మజ్జి సిరి సహస్ర ఇటీవల విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై నెలకొన్న వివాదం ప్రస్తుతం విచారణలో ఉంది.

విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు బీసీ-డీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న హోదా, తహసీల్దార్‌ జారీ చేసిన కుల, స్థానికత, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను వినియోగించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే వ్యవహారానికి సంబంధించి దాఖలైన మరో అనుబంధ పిటిషన్‌పై విచారణను ముగించింది. ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఈ అంశంపై విచారణ చేపట్టినందున తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.

విజయనగరం జెడ్పీ ఛైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. వైఎస్సార్‌సీపీకి చెందిన బొమ్మి శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సిరిసహస్ర జైన కుటుంబంలో జన్మించారని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. అనంతరం ఆమెను మజ్జి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారని తెలిపారు. దత్తత కారణంగా ఆమెను తూర్పు కాపు/గాజుల కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణిస్తూ తహసీల్దార్‌ బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం చెల్లదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సిరిసహస్రకు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు, స్థానికత, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను కూడా వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

సిరిసహస్రకు బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ఎస్సీ, ఎస్టీ, బీసీ చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఆమె జైన కుటుంబంలో జన్మించినందున ఓసీ సామాజిక వర్గానికి చెందుతారని, దత్తత తీసుకున్నంత మాత్రాన జన్మతః వచ్చిన కులం మారదని కోర్టుకు వివరించారు.

మరోవైపు, సిరిసహస్ర కుల ధ్రువీకరణ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని పిటిషనర్‌ గతంలోనే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారని కలెక్టర్‌ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇది ఎన్నికలకు సంబంధించిన వివాదమని, అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలే తప్ప హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సిరిసహస్ర కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ, జిల్లా కలెక్టర్‌ వద్ద విచారణలో ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్థించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదానికి సంబంధించి పిటిషనర్‌, మజ్జి సిరిసహస్ర ఇప్పటికే స్క్రూట్నీ కమిటీ ముందు హాజరైన విషయాన్ని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ డిసెంబర్‌ 10న జరగనుందని న్యాయవాదులు పేర్కొంటున్నారని తెలిపారు.

దత్తత ద్వారా బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు సిరిసహస్రకు అర్హత ఉందా? లేదా? అనే అంశాన్ని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ, జిల్లా కలెక్టర్‌ సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఈ దశలో హైకోర్టు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే అవి స్క్రూట్నీ కమిటీ విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రస్తుతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా, బీసీ-డీ కేటగిరీ కింద సిరిసహస్ర కోరుతున్న ప్రయోజనాలు, కుల ధ్రువీకరణ పత్రంపై జిల్లా కలెక్టర్‌ జారీ చేసే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *