అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రైళ్లలో కర్పూరం, అగరబత్తులు వెలిగించడం, దీపాలు పెట్టడంపై నిషేధం విధించింది. ఇలాంటి వాటి కారణంగా అగ్ని ప్రమాదాలను జరిగే ప్రమాదం ఉందని.. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరింది.

అయ్యప్ప స్వామి శరణుఘోషతో శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు రైల్వే శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించే అయ్యప్ప భక్తులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. రైలు బోగీల్లో కర్పూరం వెలిగించడం, అగరబత్తులు కాల్చడం, దీపాలు వెలిగించి పూజలు చేయడంపై ఆంక్షలు విధించింది. అగ్ని ప్రమాదాల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

అయ్యప్ప దీక్షలో భాగంగా భక్తులు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పూజల్లో కర్పూర హారతి, అగరబత్తులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శబరిమల యాత్రకు వెళ్లే సమయంలోనూ కొందరు భక్తులు రైళ్లలోనే పూజలు నిర్వహిస్తుంటారు. అయితే రైలు బోగీల్లో మంటలు వెలిగించడం వల్ల ఇతర ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది..

రైల్వే నిబంధనల ప్రకారం ప్రమాదకరమైన మండే వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి. పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, బాణసంచా వంటి ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. రైలు బోగీల్లో కర్పూరం, అగరబత్తులు, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం కూడా అనుమతించరు. అయితే కర్పూరం, అగరబత్తుల ప్యాకెట్లను సాధారణ పూజా సామగ్రిగా తీసుకెళ్లడంపై వర్తించే ఖచ్చితమైన నిబంధనలను ప్రయాణికులు సంబంధిత రైల్వే అధికారుల వద్ద నిర్ధారించుకోవాలి.

రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించేలా నిషేధిత ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లినా, రైళ్లలో మంటలు వెలిగించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం నేర స్వభావాన్ని బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

శబరిమల యాత్ర సీజన్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కేరళ వైపు వెళ్లే రైళ్లలో అయ్యప్ప భక్తుల రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులు ప్రయాణానికి ముందే నిషేధిత వస్తువుల జాబితాను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇరుముడిలో పూజా సామగ్రి తీసుకెళ్లే విషయంలోనూ ముందుగానే స్పష్టత తీసుకోవడం మంచిది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *