
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉత్తర తెలంగాణ ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించేందుకు సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా కరీంనగర్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలును ప్రవేశపెట్టాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కరీంనగర్-కాచిగూడ మధ్య నడుస్తున్న డెమూ రైలు సుమారు 309 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో గమ్యస్థానానికి చేరుకోవడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతోంది.
అయితే పెద్దపల్లి, కాజీపేట మీదుగా ప్రత్యామ్నాయ రైల్వే మార్గాలు అందుబాటులో ఉండటంతో కొత్త రైలు సేవలను ప్రారంభిస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్గంలో రైలు నడిపితే కేవలం 3.5 నుంచి 4 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.
ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తర తెలంగాణ ప్రజలకు సొంతూళ్లకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా నగర తూర్పు ప్రాంతాలైన ఘట్కేసర్, చర్లపల్లి, మౌలాలి, బోడుప్పల్, తార్నాక తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలు స్వగ్రామాలకు వెళ్లేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బస్సు ప్రయాణాల్లో అధిక ఛార్జీలతో పాటు ట్రాఫిక్ రద్దీ ఇబ్బంది పెడుతుండగా.. రైళ్లలో ప్రయాణించాలంటే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా కరీంనగర్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలును ప్రవేశపెట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు సైతం ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో నివసించే ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్-కరీంనగర్ మధ్య రాకపోకలకు ఆర్టీసీ బస్సులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది. టికెట్ ధరలు కనీసం రూ.220 నుంచి ప్రారంభమవుతుండగా, లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు మరింత అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పండగలు, వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సీట్లు దొరకడం కూడా కష్టమవుతోంది.
మరోవైపు, రైలు ప్రయాణం చౌకైనప్పటికీ ప్రస్తుతం కరీంనగర్ నుంచి కాచిగూడకు నడుస్తున్న డెమూ ప్యాసింజర్ రైలు ప్రయాణికులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదు. ఈ రైలు జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మీదుగా సుమారు 309 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటోంది. దీంతో ప్రయాణానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతోంది.
దీనికి తోడు నిజామాబాద్-మేడ్చల్ మార్గంలో సింగిల్ రైల్వే లైన్ ఉండటం, గరిష్ఠ వేగ పరిమితి గంటకు 110 కిలోమీటర్లుగా ఉండటంతో ప్రయాణ సమయం మరింత పెరుగుతోంది. ఫలితంగా బస్సులో కేవలం నాలుగు గంటల్లో చేరుకోగలిగే గమ్యస్థానానికి రైలులో దాదాపు రెట్టింపు సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కరీంనగర్ నుంచి పెద్దపల్లి, కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు నేరుగా రైలు సర్వీసు నడిపేందుకు అవసరమైన రైల్వే మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి-కాజీపేట మధ్య మూడో రైల్వే లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, కాజీపేట నుంచి ఘట్కేసర్ వరకు రెండో లైన్, ఘట్కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు నాలుగో రైల్వే లైన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
పెద్దపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే కరీంనగర్-పెద్దపల్లి మధ్య ఉన్న 35 కిలోమీటర్ల సింగిల్ లైన్లోనూ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే వీలుందని ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నవారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి, కాజీపేట మార్గంలో నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలును ప్రవేశపెడితే సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటల తరబడి పడుతున్న ప్రయాణాన్ని సుమారు మూడు నుంచి మూడున్నర గంటల నుంచి గరిష్ఠంగా నాలుగు గంటల్లోపు పూర్తి చేయవచ్చని ప్రతిపాదకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త రైలు సేవలు అందుబాటులోకి వస్తే సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు బస్సులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఉప్పల్, ఘట్కేసర్, చర్లపల్లి, మౌలాలి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నివసించే ఉత్తర తెలంగాణ ప్రజలకు తమ నివాసాలకు సమీపంలోని రైల్వే స్టేషన్ల నుంచే ప్రయాణం ప్రారంభించే వెసులుబాటు కలుగుతుంది. దీంతో నగరంలోని రద్దీ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, రోడ్డు ప్రయాణాలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
అంతేకాకుండా కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట, సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ తరచూ సొంతూళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఈ రైలు సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
ఇప్పటికే ఈ మార్గంలో అవసరమైన రైల్వే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రతిపాదకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు, రాకపోకల రద్దీని పరిగణనలోకి తీసుకుని సికింద్రాబాద్-కరీంనగర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలు లేదా మెము రైలు నడిపే ప్రతిపాదనను పరిశీలించాలని రైల్వే శాఖకు డిమాండ్ చేస్తున్నారు.
