హైదరాబాద్‌, నవంబర్‌ 20: కృత్రిమ మేధ (ఏఐ), పరిశోధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఐక్యరాజ్యసమితి వేదికగా 1ఎమ్‌1బీ సంస్థ నిర్వహించిన గ్లోబల్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో శుక్రవారం ఆయన ప్రసంగించారు.

తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లోనూ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. నైపుణ్యం కలిగిన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, బలమైన పారిశ్రామిక పునాదులు తెలంగాణకు ప్రధాన బలాలని అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు.

సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఏఐ, డిజిటల్‌ ఆవిష్కరణలను వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి రంగాల్లో విస్తృతంగా వినియోగించడం ద్వారా అనేక సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపవచ్చని పేర్కొన్నారు.

సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే సమర్థవంతమైన ఆవిష్కరణల వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ లక్ష్యంతో తెలంగాణలో ఆవిష్కరణల ఆధారిత ఎకోసిస్టమ్‌ను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని మంత్రి వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *