
విమాన సర్వీసుల నిర్వహణలో వరుస అంతరాయాలు, విమానాల రద్దులు, సర్వీస్ ప్రొవైడర్లకు బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17న జారీ చేసిన నోటీసుకు ఏడు రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
స్పైస్‌జెట్ విమానాల సమయపాలన గణనీయంగా క్షీణించడంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. సర్వీసులు ఆలస్యంగా నడవడం, ముందస్తు సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడం ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొంది.
66 విమానాలకు అనుమతి.. నడుస్తున్నవి 15 మాత్రమే!
శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా రోజుకు 66 విమానాలు నడిపేందుకు స్పైస్‌జెట్‌కు అనుమతి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం 15 విమానాలనే నిర్వహిస్తున్నట్లు డీజీసీఏ గుర్తించింది. అయితే పూర్తి షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రయాణికుల నుంచి బుకింగ్‌లు స్వీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈశాన్య రాష్ట్రాలు, సుదూర ప్రాంతాలకు సరిపడా విమాన సర్వీసులు నడపకపోవడంపై గత మే నెలలోనే డీజీసీఏ జరిమానా విధించింది. అయినప్పటికీ ఆ మొత్తాన్ని సంస్థ చెల్లించలేదని నోటీసులో ప్రస్తావించినట్లు సమాచారం. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అవసరమైన అర్హత ప్రమాణాలను కూడా స్పైస్‌జెట్ అందుకోలేకపోయిందని డీజీసీఏ పేర్కొంది.
స్టాక్ మార్కెట్లోనూ ప్రభావం
డీజీసీఏ షోకాజ్ నోటీసు వార్తల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరుపై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 5 శాతం నష్టపోయి రూ.9.74 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
