
దేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.7,280 కోట్ల పథకంలో హైదరాబాద్‌కు చెందిన మిడ్వెస్ట్ ఎనర్జీ సంస్థ విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) అందుకుంది. ఈ పథకం కింద ఏటా 1,200 టన్నుల అయస్కాంతాలను తయారు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కిలోకు రూ.505.05 చొప్పున విక్రయ ప్రోత్సాహకాన్ని పొందేందుకు బిడ్ దాఖలు చేసింది.
90 రోజుల్లో పనితీరు హామీ
ఎల్ఓఐ అందుకున్న సంస్థ 90 రోజుల్లోగా రూ.40 కోట్ల పనితీరు హామీని సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయనుంది. దీంతో పథకం కింద సంస్థకు అధికారికంగా తదుపరి అనుమతులు లభించనున్నాయి.
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక
హైదరాబాద్‌లో ఇప్పటికే రూ.250 కోట్ల పెట్టుబడితో మిడ్వెస్ట్ ఎనర్జీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో ఈ కేంద్రానికి ఏడాదికి 500 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2027 చివరి నాటికి దీనిని 1,500 టన్నులకు పెంచాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.
దేశీయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, కీలక ముడి పదార్థాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని సంస్థ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఈఓ సౌమ్య కొల్లారెడ్డి తెలిపారు.
