పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకంలో మిగిలిపోయిన 400 ఖాళీల భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2022 నవంబరులో జారీ చేసిన నియామక నోటిఫికేషన్‌లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులను మెరిట్‌ రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం తదుపరి అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB)ని ఆదేశించింది.

ఈ ప్రక్రియను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వంటి ప్రాథమిక దశల్లో కొందరు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ నుంచి వైదొలిగితే వారి స్థానంలో తదుపరి మెరిట్‌ జాబితాలో ఉన్నవారికి అవకాశం కల్పించకపోవడం అన్యాయమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రొవిజనల్‌ ఎంపిక జాబితాను సమీక్షించబోమని వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదని పేర్కొంటూ నోటిఫికేషన్‌లోని క్లాజ్‌ 33(ఐగీ)ను చేర్చడాన్ని తప్పుబట్టింది.

ఖాళీ పోస్టులను తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయకుండా అడ్డుకుంటున్న ఈ నిబంధన చెల్లదని ప్రకటించింది. నియామక ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని నిబంధనలను ప్రశ్నించే హక్కు లేదన్న పోలీసు నియామక మండలి వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నంత మాత్రాన ఏకపక్ష నిబంధనలను అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. వివిధ దశల్లో పరీక్షలు పూర్తిచేసి తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలయ్యే వరకు సదరు నిబంధన వల్ల కలిగే నష్టం పిటిషనర్లకు తెలియదని పేర్కొంది. ఈ దశలోనే కోర్టును ఆశ్రయించేందుకు తగిన కారణం ఏర్పడిందని వివరించింది.

జస్టిస్‌ ఎన్‌. విజయ్‌ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అదే ఏడాది నవంబరు 28న పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే అందులోని నిబంధనలను సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *