తమలపాకు కేవలం పూజలు, శుభకార్యాలకే పరిమితం కాదు.. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. ఇందులోని కొన్ని సహజ సమ్మేళనాలకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు తమలపాకు రసం తయారీ, విక్రయాన్ని చిన్న వ్యాపారంగా ప్రారంభించవచ్చు. అయితే ఆరోగ్య ప్రయోజనాలపై అతిశయోక్తులకు దూరంగా ఉండాలి. నాణ్యత, పరిశుభ్రత, అనుమతులు పాటించడం ముఖ్యం..

తమలపాకు, భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. దీని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వ్రతాలు, పూజలు తమలపాకులు లేకుండా పూర్తి కావు.. అలాగే తాంబూలాల్లో దీని ప్రాధాన్యత ఎంతో. తమలపాకు లేనిదే శుభకార్యాలు అసంపూర్ణం. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్యపరంగానూ తమలపాకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. తమలపాకును తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ప్రస్తుతం తమలపాకు మొక్కలను ఇంట్లో పెంచి భారీగా సంపాదిస్తున్నారు. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆంజనేయస్వామి ఇంట్లో ఉన్నట్లేనని ప్రతీతి. ఈ మొక్క ఏపుగా, చక్కగా పెరిగితే అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. అంతేకాకుండా, బుధగ్రహ అనుకూలం కూడా కలుగుతుందని విశ్వసిస్తారు

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

ఆరోగ్యపరంగా తమలపాకు అనేక అద్భుత లక్షణాలను కలిగి ఉంది. దీనిని భారతదేశంలో ఒక ఆయుర్వేద ఆకుగా పరిగణిస్తారు. అనేక ఆయుర్వేద మందుల్లో ఈ ఆకులను వినియోగిస్తారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి అనేక వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా, మలబద్ధకం సమస్య ఉన్నవారికి తమలపాకు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరిచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

తమలపాకులతో మంచి బిజినెస్..

ఇన్ని ప్రయోజనాలున్న తమలపాకును ఒక లాభదాయక వ్యాపారంగా మార్చుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యాపారాల్లో తమలపాకు రసం బిజినెస్ ఒకటి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. రైతుల నుండి తక్కువ ధరకు తమలపాకులను కొనుగోలు చేయవచ్చు లేదా హోల్‌సేల్ మార్కెట్ల నుండి కూడా సేకరించవచ్చు. ఆ తమలపాకులను శుభ్రం చేసి, ప్రత్యేక మెషిన్‌లో వేస్తే స్వచ్ఛమైన రసం వస్తుంది. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే ఈ మెషిన్లు లభిస్తున్నాయి.

తమలపాకుల నుండి వచ్చిన రసాన్ని శుభ్రమైన బాటిళ్లలో ప్యాకేజ్ చేసి విక్రయించవచ్చు. దీని మార్కెటింగ్ కోసం అనేక మార్గాలు ఉన్నాయి. జనాలు ఎక్కువగా ఉండే కూరగాయల మార్కెట్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి నేరుగా విక్రయించవచ్చు. అలాగే, ఆయుర్వేద, ఆరోగ్య సిద్ధ వైద్యశాలకు సరఫరా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా మీ ఉత్పత్తిని ప్రచారం చేసి, ఆన్‌లైన్ ఆర్డర్‌లను స్వీకరించవచ్చు. షాపులకు, కిరాణా దుకాణాలకు కూడా విక్రయించి మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. మెరుగైన నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్.. సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలతో తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.

అలాగే తమలపాకు రసం వ్యాపారం ప్రారంభించే ముందు FSSAI అనుమతులు, నిల్వకాలం, ఆహార భద్రత ప్రమాణాలను పరిశీలించడం అవసరం.. ఏమైనా సలహాలు సందేహాలుంటే నిపుణులను సంప్రదించడం మంచిది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *