ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కొఠియా గ్రామాల ప్రజలపై ఒడిశా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కొఠియా గ్రామాల ప్రజలపై ఒడిశా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని ఈ గ్రామాలపై పోలీసుల జులుంను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సాలూరు నియోజకవర్గంలోని సరిహద్దు గిరిజన గ్రామస్తులపై ఒడిశా పోలీసులు వేధింపులు బాధాకరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రభుత్వం నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించాలని ఒడిశా పోలీసులు కొఠియా గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఆరుగురు గిరిజనులను ఒడిశా పోలీసులు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మంత్రి సంధ్యారాణిని కొఠియా గ్రామాల ప్రజలు కలిసి.. ఆరుగురు గిరిజనులను కిడ్నాప్ చేశారంటూ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామాల్లో ఒడిశా పోలీసులు రెచ్చిపోతున్నారంటూ ఆమెకు విన్నవించుకున్నారు. దాంతో మంత్రి సంధ్యారాణి పైవిధంగా స్పందించారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్పంచి, వార్డు మెంబర్ పదవులకు జరుగుతున్న ఎన్నికలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఒడిశా రెవెన్యూ, విపత్తు నియంత్రణ శాఖల మంత్రి సురేశ్ పూజారి భువనేశ్వర్లో స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగకుండా నిలవరించగలిగామని గుర్తు చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికలు కూడ జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.
